Wednesday, September 9, 2026
Google search engine
Homeతెలంగాణవైద్యులపై దాడులు చేస్తే వెంటనే అరెస్ట్ .. సుప్రీంకోర్టు స్పష్టీకరణ:

వైద్యులపై దాడులు చేస్తే వెంటనే అరెస్ట్ .. సుప్రీంకోర్టు స్పష్టీకరణ:

  • రాజకీయ నాయకుల అరాచకాలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం
  • తక్షణమే అరెస్టు చేయాలి.. స్వేచ్ఛగా తిరగనివ్వరాదంటూ సంచలన ఆదేశాలు
  • సమాజానికి గట్టి సందేశం వెళ్లాల్సిందేనని ధర్మాసనం వెల్లడి

న్యూఢిల్లీ:

వైద్యులు, ఆసుపత్రి సిబ్బందిపై దాడులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, అటువంటి వారిని తక్షణమే అరెస్టు చేయాలని సుప్రీంకోర్టు అత్యంత కఠినంగా స్పష్టం చేసింది. మహారాష్ట్రలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు వైద్యులు మరియు ఆసుపత్రి సిబ్బందిపై సాగిస్తున్న దాడుల పట్ల సోమవారం సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ తరహా ఘటనలను తేలికగా పరిగణించడానికి వీలే లేదని, నేరానికి పాల్పడిన వాళ్లను సమాజంలో స్వేచ్ఛగా తిరగనివ్వడం సరికాదని తేల్చిచెప్పింది.

మహారాష్ట్రలోని థాణె జిల్లా డోంబివ్‌లి పరిధిలోని కేడీఎంసీ శాస్త్రీనగర్ ఆసుపత్రిలో వైద్యులు మరియు సిబ్బందిపై భౌతిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో జూలై 6న అరెస్టయిన శివసేన కార్పొరేటర్ రమేశ్ సుక్రియ మాత్రే దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. బాంబే హైకోర్టు తనకు బెయిల్ మంజూరు చేసే సమయంలో విధించిన కఠిన షరతులను—ప్రత్యేకించి మహారాష్ట్రలోనే నివసించకూడదనే ఆదేశాలను—సవాలు చేస్తూ నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ముంబై నగరంలో తిరిగేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు.

*దిగజారుతున్న పరిస్థితులు:
వైద్యులపై దాడుల ఘటనలు దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరిగిపోతున్నాయని, పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తున్నదని విచారణ సందర్భంగా నిందితుడి తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టు దృష్టికి తెచ్చారు. ఇదే సమయంలో పాల్ఘర్‌లో ఆదివారం జరిగిన మరో దాడి ఉదంతాన్ని కూడా ధర్మాసనం ప్రస్తావించింది. అక్కడ ఒక ఆసుపత్రిలో రిసెప్షనిస్ట్‌పై చేయి చేసుకుని, మహిళా ఉద్యోగిని బెదిరించిన ఘటనలను తీవ్రంగా పరిగణించింది.

నిందితుడి తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ, తాము అప్పీల్‌ను ఉపసంహరించుకోవాలని భావిస్తున్నామని, పది రోజుల్లోగా చార్జ్‌షీట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించిందని, నిందితునికి త్వరలోనే తగిన శిక్ష పడుతుందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, అతనికి శిక్ష పడనివ్వండి, దానితో మాకు సంబంధం లేదు, కానీ ఇలాంటి చర్యలకు పాల్పడే వారికి వ్యతిరేకంగా సమాజానికి ఒక బలమైన, కఠినమైన సందేశం వెళ్లాలని తేల్చిచెప్పింది. నిందితునికి బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments