- ప్రపంచానికే సరికొత్త దిశానిర్దేశం
- ‘భారత్ సమ్మిట్ 2.0’తో అంతర్జాతీయ విధాన చర్చలకు వేదికగా భాగ్యనగరం
- ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దార్శనిక పాలనలో ప్రపంచ పటంపై తెలంగాణకు మరో గుర్తింపు
- 70కి పైగా దేశాలు.. 1,000 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులతో సమ్మిట్
- నవంబర్ 13, 14 తేదీల్లో మహా సమ్మేళనం.
- దావోస్ ఆర్థిక వేదికకు దీటుగా ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వంపై మేధోమథనం.
- 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా ‘తెలంగాణ రైజింగ్’ ప్రణాళికల ఆవిష్కరణ.
- ప్రపంచ రాజధానిగా హైదరాబాద్ మహానగరం సరికొత్తగా రూపాంతరం చెందుతోంది.
తెలంగాణలో ప్రజా ప్రభుత్వ పాలన విధానం ద్వారా ప్రపంచ స్థాయిలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ , ప్రపంచానికే మెగా క్యాపిటల్ సిటీగా ఎదుగుతోంది. ఇందుకు భారత్ సమ్మిట్ 2.0కి ఆతిథ్యం ఇవ్వడమే మైలురాయిగా నిలుస్తోంది.
ప్రపంచ దేశాల మధ్య భౌగోళిక రాజకీయ విభేదాలు, ఆర్థిక అసమానతలు, యుద్ధ వాతావరణం పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో శాంతి, ప్రజాస్వామ్యం, సమానత్వం, సహకారం వంటి విలువలకు కొత్త ప్రాధాన్యత కల్పించాల్సిన చారిత్రక అవసరం ఏర్పడింది. ఇలాంటి కీలక సమయంలో, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో విశ్వనగరంగా ఆవిర్భవిస్తోన్న హైదరాబాద్‌ను అంతర్జాతీయ మేధోమథన వేదికగా నిలబెడుతూ తెలంగాణ ప్రభుత్వం ‘భారత్ సమ్మిట్ 2.0’కు శ్రీకారం చుట్టింది.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమర్థవంతమైన నాయకత్వం, దార్శనిక పాలనలో నవంబర్ 13, 14 తేదీల్లో నిర్వహించనున్న ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుకు 70కి పైగా దేశాల నుంచి 1,000 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతుండటం తెలంగాణ గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేస్తోంది.
సమర్థవంతమైన పాలన.. విశ్వనగరానికి కొత్త కళ :
తెలంగాణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి హైదరాబాద్ నగరాన్ని కేవలం ఐటీ, ఫార్మా రంగాలకే పరిమితం చేయకుండా, ప్రపంచస్థాయి విధాన నిర్ణయాలు, అంతర్జాతీయ సదస్సులకు కేంద్రబిందువుగా తీర్చిదిద్దే వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు.
పారదర్శకమైన పరిపాలన, వేగవంతమైన నిర్ణయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతుల కల్పనతో నేడు హైదరాబాద్ ప్రపంచ దేశాల ప్రతినిధులను ఆకర్షిస్తోంది. కేవలం ఒక రాజకీయ సమావేశంగా కాకుండా, ప్రపంచ ప్రజాస్వామ్యానికి ప్రత్యామ్నాయ ఆలోచనలు, సామాజిక-ఆర్థిక న్యాయానికి కొత్త దిశను చూపే గొప్ప వేదికగా ఈ సమ్మిట్ రూపుదిద్దుకుంది.
తొలి అడుగు నుంచి అంతర్జాతీయ ఉద్యమం వరకు
భారత్ సమ్మిట్ ప్రయాణం హైదరాబాద్‌లో జరిగిన మొదటి సదస్సుతో ఘనంగా ప్రారంభమైంది. ఆనాడు 100కు పైగా దేశాల నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు పాల్గొని ప్రజాస్వామ్య పరిరక్షణ, వాతావరణ న్యాయం, లింగ సమానత్వం, సమ్మిళిత పాలనపై విస్తృతంగా చర్చించారు. ఆ సదస్సులో రూపొందించిన 44 అంశాలతో కూడిన ‘హైదరాబాద్ డిక్లరేషన్’ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది.
ఆ స్ఫూర్తితో ఇప్పుడు రెండో విడతలో మరింత విస్తృత స్థాయిలో ప్రపంచ మేధావులను, విధాన రూపకర్తలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో తెలంగాణ ప్రభుత్వం సఫలమైంది.
ప్రపంచానికి గాంధీ, నెహ్రూ ఆలోచనల సందేశం
నేటి ప్రపంచంలో విద్వేష రాజకీయాలు, విభజన ధోరణులు పెరుగుతున్న నేపథ్యంలో మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతం, జవహర్‌లాల్ నెహ్రూ అలీనోద్యమ విదేశాంగ విధానం, మిశ్రమ ఆర్థిక విధానాల ఆవశ్యకతను ఈ సదస్సు ప్రపంచానికి చాటిచెప్పనుంది.
అహింస, శాంతి, దౌత్య సంబంధాల ద్వారా అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించుకోవడం, ‘గ్లోబల్ సౌత్’ దేశాల మధ్య ఐక్యతను బలోపేతం చేయడం వంటి కీలక అంశాలు ఇక్కడ చర్చకు రానున్నాయి. అదేవిధంగా ఎన్నికల పారదర్శకత, ఓటు హక్కు పరిరక్షణ, మీడియా స్వేచ్ఛ, రాజ్యాంగ సంస్థల స్వతంత్రత వంటి ప్రజాస్వామ్య మూలస్తంభాల బలోపేతంపై లోతైన విశ్లేషణ జరగనుంది.
20 కీలక సెషన్లు.. ‘తెలంగాణ రైజింగ్’ దార్శనికత
ఈ సదస్సులో 12 అంతర్జాతీయ అంశాలపై సమావేశాలు, తెలంగాణ అభివృద్ధి నమూనాను ఆవిష్కరించే 8 ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు.
- అంతర్జాతీయ అంశాలు : మారుతున్న ప్రపంచ రాజకీయ వ్యవస్థ, కృత్రిమ మేధస్సు (AI), క్లౌడ్ క్యాపిటలిజం, వాతావరణ మార్పులు, మహిళా సాధికారత, యువత భాగస్వామ్యం.
- తెలంగాణ రైజింగ్ & ఆర్థిక లక్ష్యాలు: రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న సీఎం రేవంత్ రెడ్డి సంకల్పానికి ఈ వేదిక అంతర్జాతీయ సహకారాన్ని అందించనుంది.
‘భారత్ ఫ్యూచర్ సిటీ’, ఆధునిక పట్టణీకరణ, సంక్షేమ పథకాలు, పారిశ్రామిక ప్రగతిని ప్రపంచ ప్రతినిధులకు పరిచయం చేయనున్నారు.
అవర్ వరల్డ్ ఇన్‌స్టిట్యూట్’: ప్రగతిశీల ఆలోచనలు, ప్రజాస్వామ్య విలువలపై నిరంతర పరిశోధనల కోసం హైదరాబాద్ కేంద్రంగా ఈ అంతర్జాతీయ సంస్థ ఏర్పాటు ప్రతిపాదన సదస్సుకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
దావోస్ స్థాయి గుర్తింపు.. తెలంగాణకు ఆర్థిక ప్రయోజనాలు
ప్రపంచ ఆర్థిక వేదికగా దావోస్ వ్యాపార, పెట్టుబడులపై దృష్టి సారిస్తే, భారత్ సమ్మిట్ ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వంపై దృష్టి సారిస్తోంది. వచ్చే నెలలో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు ముందు ఈ సదస్సు జరగడం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఎంతో కీలకం. దీనివల్ల రాష్ట్రానికి బహుళ ప్రయోజనాలు చేకూరనున్నాయి:
- విదేశీ పెట్టుబడుల వెల్లువ: అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో నేరుగా పరిచయాలు పెరిగి ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ, ఏఐ, తయారీ రంగాల్లో భారీ పెట్టుబడులకు మార్గం సుగమం అవుతుంది.
- పర్యాటక, ఆతిథ్య రంగాలకు ఊతం: వేలాది మంది విదేశీ ప్రతినిధుల రాకతో హోటళ్లు, రవాణా, ఈవెంట్ మేనేజ్‌మెంట్, విమానయాన రంగాలకు కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి.
- యువతకు విశ్వవ్యాప్త అవకాశాలు: విదేశీ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలతో అనుసంధానం పెరిగి తెలంగాణ యువతకు నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ ఉద్యోగాలు, స్టార్టప్ భాగస్వామ్యాల్లో కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి.
- ఎగుమతులు & వ్యాపార విస్తరణ: వివిధ దేశాలతో ప్రత్యక్ష సంబంధాల వల్ల తెలంగాణ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో గుర్తింపు లభిస్తుంది.
భవిష్యత్ కార్యాచరణ.. నవ యుగ తెలంగాణ నిర్మాణం
అంతర్జాతీయ వేదికపై లభించిన ఈ గుర్తింపును శాశ్వత ఆర్థిక ఫలితాలుగా మార్చేందుకు ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతోంది. అవగాహన ఒప్పందాల (MoUs) అమలు, పరిశోధనా భాగస్వామ్యాలు, పెట్టుబడుల పర్యవేక్షణపై వార్షిక నివేదికల ద్వారా పారదర్శకతను చాటుకోనుంది. ఒకప్పుడు ఐటీకి చిరునామాగా నిలిచిన హైదరాబాద్..
నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రపంచ ప్రజాస్వామ్య, సామాజిక, ఆర్థిక విధాన చర్చలకు చిరునామాగా ఎదుగుతూ నవ తెలంగాణ నిర్మాణంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది.
శివంత్ రెడ్డి
స్పెషల్ కరస్పాండెంట్..


