ఎల్బీనగర్:
గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని వివిధ నివాస ప్రాంతాల్లో నెలకొన్న 22-ఏ సమస్యను పరిష్కరించి, అర్హులైన ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ నాయకులు, స్థానిక ప్రజల తరపున బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మంగళవారం సరూర్‌నగర్ తహసీల్దార్ పి. వేణుగోపాల్ ని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని కొన్ని నివాస ప్రాంతాలకు సంబంధించిన ఆస్తులు 22ఏ నిషేధిత జాబితాలో ఉండటంతో, ఎన్నో సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్న కుటుంబాలు తమ ఆస్తుల రిజిస్ట్రేషన్, విక్రయం, ఇతర ఆస్తి సంబంధిత లావాదేవీల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.చాలా మంది ప్రజలు తమ ఆస్తులకు సంబంధించి ప్రభుత్వ పన్నులు, ఆస్తి పన్నులు మరియు ఇతర ప్రభుత్వ బకాయిలను క్రమం తప్పకుండా చెల్లిస్తూ,ఎన్నో సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ 22ఏ జాబితాలో ఆస్తులు ఉండటం వల్ల ప్రజలు తమ స్వంత ఆస్తులపై పూర్తి హక్కులను వినియోగించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.అర్హత ఉన్న నివాస ఆస్తులను గుర్తించేందుకు సంబంధిత రెవెన్యూ రికార్డులు, పాత రికార్డులు, మ్యాపులు మరియు ఇతర ఆధారాలను సమగ్రంగా పరిశీలించాలని తహసీల్దార్‌ను కోరారు.అలాగే 22ఏ కింద ఏ ప్రాంతాలు, ఏ ఆస్తులు నిషేధిత జాబితాలో ఉన్నాయో స్పష్టత కోసం అధికారిక మ్యాప్/స్కెచ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.ప్రజలకు ఎటువంటి అన్యాయం జరగకుండా, వాస్తవ పరిస్థితులను పరిశీలించి అర్హత ఉన్న ఆస్తులను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.22ఏ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు పరిష్కారం లభించే వరకు వారి తరఫున తమ పోరాటం కొనసాగుతుందని బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం డివిజన్ బీజేపీ అధ్యక్షులు దాసరి జయప్రకాష్, బీజేపీ నాయకులు రఘునందన్ జోషి, వంశీ గంగపుత్ర, టింకు, గిరీష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.


