- 2025 ఆర్థిక శాస్త్ర నోబెల్ ముగ్గురికి
- ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వృద్ధి సిద్ధాంతానికి గౌరవం
- జోయెల్ మోకిర్, ఫిలిప్ అఘియన్, పీటర్ హోవిట్ విజేతలు
- “క్రియేటివ్ డిస్ట్రక్షన్” సిద్ధాంతానికి అంతర్జాతీయ గుర్తింపు
ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాలను (Nobel Prize in Economic Sciences) రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. 2025 సంవత్సరానికి గాను ముగ్గురు ప్రముఖ ఆర్థికవేత్తలు ఈ గౌరవాన్ని అందుకోనున్నారు.
‘ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వృద్ధి’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, దాని ప్రాముఖ్యతను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చూపించినందుకు జోయెల్ మోకిర్, ఫిలిప్ అఘియన్, పీటర్ హోవిట్‌లను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు అకాడమీ ప్రకటించింది.
జోయెల్ మోకిర్ అమెరికన్–ఇజ్రాయెలీ ఆర్థికవేత్త కాగా, పీటర్ హోవిట్ కెనడాకు, ఫిలిప్ అఘియన్ ఫ్రాన్స్‌కు చెందినవారు. సాంకేతిక పురోగతి, ఆవిష్కరణల ద్వారా స్థిరమైన ఆర్థిక వృద్ధి సాధ్యమయ్యే మార్గాలను వివరించినందుకు మోకిర్ గౌరవించబడ్డారు.
ఇక ‘క్రియేటివ్ డిస్ట్రక్షన్’ (Creative Destruction) ద్వారా నిరంతర వృద్ధి సాధ్యమని సాక్ష్యాధారాలతో వివరించినందుకు అఘియన్, హోవిట్‌లను ఎంపిక చేశారు. వీరి పరిశోధనలు ఆధునిక ఆర్థిక విధానాల రూపకల్పనలో, దేశాల అభివృద్ధి వ్యూహాల నిర్ణయంలో కీలకపాత్ర పోషించాయని నోబెల్ కమిటీ పేర్కొంది.
వైద్యం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, సాహిత్యం, శాంతి విభాగాలతో ప్రారంభమైన ఈ ఏడాది నోబెల్ అవార్డుల ప్రకటనలు ఆర్థిక విభాగంతో ముగిశాయి.


