- డిసెంబరు 10 నుంచి21 వరకు ఆల్ ఇండియా పోలీస్ టీ20 (పురుషులు)క్రికెట్ టోర్నీ
- దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వివిధ విభాగాల క్రీడాకారులు పాల్గొనమన్నారు.
- ఎనిమిది క్రికెట్ మైదానాల ఎంపిక
హైదరాబాద్
తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో మూడో ఆల్ ఇండియా పోలీస్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ 2026-27 (పురుషులు) డిసెంబరు 10 నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, పోలీసు విభాగాలకు చెందిన సుమారు 35 జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నాయి. టోర్నమెంట్ నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం డిజిపి సి.వి.ఆనంద్ డిజిపి కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్షించారు.
ప్రతిష్ఠాత్మకమైన జాతీయస్థాయి పోలీసు క్రికెట్ టోర్నమెంట్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం సంతోషకరమని డిజిపి పేర్కొన్నారు. పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ పోటీల్లో ప్రతి మ్యాచ్ 20 ఓవర్ల పాటు సాగనుంది.
ఎనిమిది మైదానాల ఎంపిక
టోర్నమెంట్ నిర్వహణ కోసం ఆరు ప్రధాన క్రికెట్ మైదానాలతో పాటు మరో రెండు రిజర్వు మైదానాలను ఎంపిక చేశారు. మొయినాబాద్‌లోని ఆసీస్ నగర్ లో క్రికెట్ క్రికెట్ మైదానాలను ఎంపిక చేసినట్లు కమిటీ సభ్యులు డిజిపి కి వివరించారు.
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పోలీసు క్రీడాకారుల వసతి కోసం తెలంగాణ పోలీసు అకాడమీలో ఏర్పాట్లు చేయనున్నారు. క్రీడాకారుల రవాణా, భోజన వసతి, మైదానాల నిర్వహణ, భద్రత, మ్యాచ్‌ల సమన్వయం తదితర అంశాలపై డీజీపీ అధికారులతో చర్చించారు. ప్రతి విభాగం సమన్వయంతో పనిచేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.
పలు కమిటీలకు బాధ్యతలు
టోర్నమెంట్ నిర్వహణ కోసం అడ్మినిస్ట్రేషన్, రవాణా, మీడియా ప్రచారం, భద్రత, సాంకేతిక, మ్యాచ్‌ల సమన్వయం, ఆర్థిక వ్యవహారాల కమిటీలను ఏర్పాటు చేసి బాధ్యతలు అప్పగించారు. జాతీయస్థాయి పోటీలకు హైదరాబాద్ వేదిక కానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేసి టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలని డిజిపి అధికారులకు దిశానిర్దేశం చేశారు.



