వికారాబాద్:
వికారాబాద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ స్నేహ మెహ్రా తాండూర్ పట్టణ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి పోలీసింగ్ సేవల పనితీరును సమీక్షించారు. ప్రజలకు మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ తనిఖీలో స్టేషన్ ఆవరణ పరిశుభ్రత, కార్యాలయ నిర్వహణ, రికార్డుల భద్రత, సిబ్బంది విధి నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా స్టేషన్ డైరీలు, పెండింగ్ కేసుల పురోగతి, రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు, హిస్టరీ షీట్లు, ఆర్డర్ బుక్, బీట్ బుక్స్, వారెంట్ల అమలు స్థితిగతులు, స్వాధీనం చేసుకున్న ఆస్తుల రికార్డులు కేసు ప్రాపర్టీల భద్రత వంటి అంశాలను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు, పోలీస్,ప్రజల మధ్య సాన్నిహిత్యాన్ని పెంపొందించేలా అధికారులు, సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌లో ఎలాంటి రికార్డులు పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని స్పష్టం చేశారు.మహిళలు, చిన్నారుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, వారిపై జరిగే నేరాల కేసుల్లో వేగవంతమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ రాత్రి వేళల్లో గస్తీని మరింత బలోపేతం చేయాలని, పాత నేరస్థుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
రాబోయే బోనాలు, మొహర్రం పండుగల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల నిఘాను మరింత పటిష్టం చేయాలని సూచించారు. జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా ప్రజా సేవకు అంకితభావంతో పనిచేయాలని సిబ్బందికి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తాండూర్ ఇన్స్పెక్టర్ పరమేశ్వర్, ఎస్‌ఐలు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


