అధికారుల అండదండలతో సాగుతున్న దందాలు!
ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలు.. మున్సిపల్ అధికారుల ఉదాసీనతపై స్థానికుల తీవ్ర ఆగ్రహం
బడంగ్పేట్:
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) శంషాబాద్ జోన్ పరిధిలోని బడంగ్పేట్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల పర్వం తారస్థాయికి చేరింది. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా, ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా వెలుస్తున్న భారీ గిడ్డంగులు (Warehouses) స్థానికంగా కలకలం రేపుతున్నాయి. మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఈ దందాలు సాగుతున్నప్పటికీ, అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.
*అధికారుల మౌనం.. అక్రమార్కులకు వరం
“ప్రభుత్వ అనుమతులు తీసుకోము.. అధికారులకు మామూళ్లు ఇచ్చి మేనేజ్ చేస్తాము” అనే నినాదంతో అక్రమార్కులు బరితెగిస్తున్నారు. బడంగ్పేట్ మున్సిపాలిటీ సర్కిల్-16 కార్యాలయానికి ఎదురుగా మరియు ప్రధాన రహదారి వెంట వందలాది సంఖ్యలో భారీ అక్రమ గిడ్డంగులు, వాణిజ్య నిర్మాణాలు పుట్టగొడుగులా వెలుస్తున్నాయి. నిబంధనల ప్రకారం భారీ గిడ్డంగుల నిర్మాణానికి టౌన్ ప్లానింగ్, ఫైర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ తదితర శాఖల నుండి కఠినమైన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఇవేవీ పట్టించుకోకుండా అక్రమార్కులు నిబంధనలను కాలరాస్తున్నారు.

*శాస్త్రీయ లోపాలు – ప్రాణాలకే ముప్పు
- అగ్నిప్రమాదాల పొగడ్త: ఎలాంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు, అగ్నిమాపక పరికరాలు లేకపోవడం వల్ల భవిష్యత్తులో ఏ చిన్న షార్ట్ సర్క్యూట్ జరిగినా భారీ ప్రాణ, ఆస్తీ నష్టాలు సంభవించే ప్రమాదం ఉంది.
- ట్రాఫిక్ జామ్‌లు: ప్రధాన రహదారుల వెంట భారీ వాహనాలు (లారీలు, కంటైనర్లు) నిలిపివేయడం వల్ల సామాన్య ప్రజలు, పాఠశాల విద్యార్థులు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
- ప్రజాధనానికి గండి: ప్రభుత్వానికి చెల్లించాల్సిన కోట్లాది రూపాయల బిల్డింగ్ పర్మిషన్ ఫీజులు, జీఎస్టీ తదితర రూపాల్లో రావాల్సిన ఆదాయానికి అక్రమార్కులు గండి కొడుతున్నారు.
ఫిర్యాదు చేసినా స్పందించని యంత్రాంగం
స్థానిక ప్రజలు ఈ అక్రమ నిర్మాణాలపై పలుమార్లు బడంగ్పేట్ మున్సిపల్ అధికారులకు, రాతపూర్వక ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయింది. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అధికారులే, మామూళ్ల మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.
బాధ్యులపై వేటు పడేనా?
ఈ అక్రమ నిర్మాణాల జోరు చూస్తుంటే అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా: - బడంగ్పేట్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య
- టౌన్ ప్లానింగ్ ఏసీపీ కళ్యాణ చక్రవర్తి
- టీపీఎస్ సాయి
నియంత్రణలో విఫలమవడం వల్లే ఈ అక్రమాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

*ఉన్నతాధికారులు స్పందించాలి
ఇప్పటికైనా జోనల్ కమిషనర్ చంద్రకళ, జీహెచ్ఎంసి కమిషనర్ మరియు ఆర్వీ కర్ణన్ తక్షణమే స్పందించి, బడంగ్పేట్ మున్సిపాలిటీలో సాగుతున్న అక్రమ గిడ్డంగుల నిర్మాాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన గోదాములను సీజ్ చేసి, అక్రమార్కులతో పాటు సహకరిస్తున్న అధికారులపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ‘భారత శక్తి’ డిమాండ్ చేస్తోంది.





