- ఓటర్ల నోటీసుల పరిష్కారానికి కుటుంబ సభ్యుల వ్యక్తిగత హాజరుకు అవకాశం
- అర్హత తేదీ అక్టోబర్ 1, 2026 ఆధారంగా ఫారం-6 దరఖాస్తుల పరిశీలన
- కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓటరు జాబితా సవరణ ప్రక్రియ
హైదరాబాద్:
రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా జారీ చేసిన నోటీసుల పరిష్కార యంత్రాంగాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం మరింత సులభతరం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఒక ప్రకటనలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఇంతవరకు ఓటర్లకు జారీ చేసిన నోటీసులను పరిష్కరించడంలో ఉన్న ఇబ్బందులను తొలగిస్తూ, సంబంధిత కుటుంబంలోని వయోజన సభ్యులలో ఎవరైనా ఒకరు ఓటరు నమోదు అధికారి లేదా సహాయ ఓటరు నమోదు అధికారుల ఎదుట ప్రత్యక్షంగా హాజరుకావచ్చని తెలిపారు. హాజరైన కుటుంబ సభ్యులు తమ ఓటరుకు సంబంధించిన అవసరమైన ధృవపత్రాలను, సమాచారాన్ని సమర్పించి నోటీసును పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు. ఈ నిబంధనల అమలుకు సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు స్పష్టమైన సమాచారం చేరవేశామని, ఓటర్ల నుంచి పత్రాలను సేకరించి త్వరితగతిన తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
*ఫారం-6 దరఖాస్తులపై ప్రత్యేక ఆదేశాలు
ఓటరు నమోదు కోసం దాఖలయ్యే ఫారం-6 దరఖాస్తుల పరిశీలన, డిక్లరేషన్ ఫారాల స్వీకరణ, క్లెయిమ్‌ల పరిష్కార ప్రక్రియలోనూ స్పష్టతనిచ్చారు.
- అర్హత తేదీ: అక్టోబర్ 1, 2026 ను ప్రాతిపదికగా తీసుకోవాలి.
- పెండింగ్ దరఖాస్తులు: ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులతో పాటు రాబోయే దరఖాస్తులకు కూడా ఈ తేదీ వర్తిస్తుంది.
- డిక్లరేషన్ ఫారం: నిర్దేశిత డిక్లరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా స్వీకరించి నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టాలి.
భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడి పారదర్శకంగా, ఎటువంటి లోపాలకు తావులేకుండా ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను సిఇఒ సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు.


