- గడువు తీరినా ఆగని నమశ్రీ బిల్డర్స్ అనధికారిక త్రవ్వకాలు..
- అధికారుల మౌనం వెనుక భారీ ముడుపులు?
- రంగారెడ్డి జిల్లా అవినీతి మైనింగ్ అధికారి నర్సిరెడ్డి పై మైనింగ్ సెక్రటరీ ఎం రఘునందన్ రావు ఐ.ఏ.ఎస్ దృష్టి సారించాలి..
- స్థానిక ఎమ్మార్వో పోలీసులకు రాతపూర్వక ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు.
- రంగారెడ్డి జిల్లా కలెక్టర్, మైనింగ్ సెక్రటరీ, పోలీసు ఉన్నతాధికారి, సంబంధిత నిఘా విభాగాల అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజల విజ్ఞప్తి..
ప్రజలను ప్రమాదంలో నెట్టి లోతైన సెల్లార్లు తవ్వి అక్రమ మైనింగ్ తో.. ఖాళీ ఖజానాకు కన్నం వేస్తున్నా.. గనుల శాఖ ‘పెద్దల’కు లంచాల మత్తు వదలడం లేదు! హయత్ నగర్ సర్వే నంబర్ల సాక్షిగా నమశ్రీ బిల్డర్స్ సాగిస్తున్న మొరం దోపిడీ రాక్షస క్రీడైతే, అడ్డకోవాల్సిన పోలీసు, తహశీల్దార్, మైనింగ్ బాసులు ముడుపుల కక్కుర్తితో గుడ్డివారై కూర్చున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ నర్సిరెడ్డి దయతో ప్రకృతిని గుల్ల చేస్తున్న ఈ బరితెగింపు దందాపై ఉన్నతాధికారుల కొరడా ఎప్పుడు ఝుళిపించేను?
రంగారెడ్డి జిల్లా:
రాష్ట్రంలో పచ్చని భూములు, ప్రకృతి సంపద అసాంఘిక శక్తుల కబంధ హస్తాల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నాయి. అధికారిక నిబంధనలను తుంగలో తొక్కి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ సాగుతున్న అక్రమ మైన్నింగ్ దందాలకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తి మద్దతు ఇస్తున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. హయత్ నగర్ మండలంలో అనుమతులు ముగిసినప్పటికీ, నమశ్రీ బిల్డర్స్ యాజమాన్యం సాగిస్తున్న రాక్షస త్రవ్వకాల పర్వం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

*అనుమతుల గడువు ముగిసినా సాగుతున్న దందా
హయత్ నగర్ మండలం, బాగ్ హయత్ నగర్ గ్రామం సర్వే నంబర్లు 90 మరియు 291 పరిధిలోని లెక్చరర్స్ కాలనీలో, జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రాంతంలో నమశ్రీ బిల్డర్స్ యాజమాన్యం ఎలాంటి నిబంధనలను పాటించడం లేదు. ఇక్కడ సెల్లార్ల పేరుతో భూగర్భాన్ని విచక్షణారహితంగా తవ్వుతూ, వేల టన్నుల మొరం మరియు గ్రావెల్ ను అక్రమంగా తరలిస్తున్నారు.
నిజానికి, గనులు మరియు భూగర్భ శాఖ నిబంధనల ప్రకారం ఈ ప్రాంతంలో కేవలం 10,000 మెట్రిక్ టన్నుల రవాణాకు మాత్రమే గతంలో అనుమతిచ్చారు. ఆ తాత్కాలిక పెర్మిట్ గడువు కూడా జూన్ 19, 2026 నాటికే అధికారికంగా ముగిసింది. గడువు ముగిసి నెలలు గడుస్తున్నా, క్షేత్రస్థాయి సిబ్బంది పనులు నిలిపివేయాలని హెచ్చరించినా, సదరు నిర్మాణ సంస్థ బరితెగించి దందాను కొనసాగిస్తోంది.
*అధికారుల లాలూచీ.. ప్రజాధనం లూటీ
ఈ అక్రమ త్రవ్వకాలపై సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా (SJPI) తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త కే.వి. గౌడ్ తో పాటు స్థానిక ప్రజలు తహశీల్దార్ కు, పోలీసులకు, గనుల శాఖ అధికారులకు స్పష్టమైన ఆధారాలతో వ్రాతపూర్వక ఫిర్యాదులు చేశారు. పత్రికల్లో కథనాలు వెలువడినప్పటికీ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగం నిద్ర నటిస్తోంది.
రంగారెడ్డి జిల్లా మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నర్సిరెడ్డి ఈ అవినీతి సామ్రాజ్యానికి కేంద్రబిందువుగా మారాడన్న తీవ్ర ఆరోపణలున్నాయి. లంచాల మోజులో పడి, అక్రమార్కులతో లాలూచీ పడిన సదరు అధికారి ప్రకృతి విద్వంసంలో ప్రథమ పాత్ర పోషిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. తహశీల్దార్ కార్యాలయం నుండి పోలీసు స్టేషన్ల వరకు అన్ని శాఖల అధికారులు నమశ్రీ బిల్డర్స్ అక్రమాలకు దాసోహమంటూ భారీగా ముడుపులు దండుకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
*ప్రజాగ్రహం.. ఉన్నతాధికారుల జోక్యానికి డిమాండ్:
అధికారుల ఉదాసీన వైఖరి, పాలకుల పరాముఖ్యం వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీ గండిపడుతోంది. స్థానిక ప్రజలు ప్రభుత్వ యంత్రాంగం తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి సంపదను కొల్లగొడుతూ, నిబంధనలను అపహాస్యం చేస్తున్న నమశ్రీ బిల్డర్స్ యాజమాన్యంపై మరియు వారికి అండగా నిలుస్తున్న అవినీతి మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ నర్సిరెడ్డిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
ఈ దారుణమైన అక్రమాలపై రాష్ట్ర మైనింగ్ శాఖ సెక్రటరీ ఎం. రఘునందన్ రావు తక్షణమే స్పందించి, బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేసి, అక్రమ త్రవ్వకాలపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రజలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ వార్తా కథనంపై మీ అభిప్రాయం ఏమిటి?



