Tuesday, August 11, 2026
Google search engine
Homeతెలంగాణమహా వరుణయాగం సంపూర్ణం.. కృష్ణమ్మ ఒడ్డున కనులపండువగా వైదిక క్రతువులు!

మహా వరుణయాగం సంపూర్ణం.. కృష్ణమ్మ ఒడ్డున కనులపండువగా వైదిక క్రతువులు!

రాష్ట్రం సస్యశ్యామలంగా వర్ధిల్లి, ప్రాజెక్టులు నిండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు.. నాగార్జునసాగర్‌లో భక్తిశ్రద్ధలతో ముగిసిన చతుర్విధ పారాయణం.

నల్గొండ:

దేశ, రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధి, సుభిక్షమైన జీవనం, ప్రకృతి ప్రసాదించే వర్షాల సమృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ వద్ద కృష్ణా నది తీరాన అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మహా వరుణయాగం సోమవారం ప్రశాంతంగా, శాస్త్రోక్తంగా ముగిసింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అర్చకులు, వేదపండితుల పర్యవేక్షణలో రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన 108 మంది రుత్వికులు అఖండ వేదమంత్రోచ్ఛారణల మధ్య ఈ పవిత్ర క్రతువును దిగ్విజయంగా నిర్వహించారు.

*కృష్ణమ్మ సాక్షిగా వైభవంగా హోమ క్రతువులు
సోమవారం తెల్లవారుజామున 4:00 గంటలకు గోపూజతో ప్రారంభమైన ఈ వరుణయాగంలో యాగ ప్రదక్షిణము, పుణ్యాహవచనం, అంకురారోపణము, విశేష పూజలు అత్యంత నిష్టాధురీణంగా సాగాయి. 11 ప్రత్యేక హోమగుండాలతో, చతుర్విధ పారాయణాల నడుమ ప్రతిధ్వనించిన వేద ఘోషతో నాగార్జునసాగర్‌లోని విజయ్ విహారం ప్రాంతం దివ్య ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. మధ్యాహ్నం 3:24 నిమిషాలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ నిర్వహించిన పూర్ణాహుతితో వరుణయాగం సంపూర్ణమైంది.

*పూర్ణకుంభంతో సీఎం దంపతులకు ఘన స్వాగతం
ఈ మహా యాగ సమాప్త వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. యాదగిరిగుట్ట దేవస్థాన అర్చకులు, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా సీఎం దంపతులకు పూర్ణకుంభంతో వేద మంత్రాల నడుమ ఘన స్వాగతం పలికారు. యాగశాల వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులు, రుత్వికుల మార్గదర్శకత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ పవిత్ర క్రతువులో మంత్రి శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు సైతం పాల్గొని దైవ కృపను యాచించారు.

*ప్రకృతి, మానవ జీవితాల సమ్మేళనం సంప్రదాయం:
ఆధునిక శాస్త్రీయ అంచనాలు, అభివృద్ధి ప్రణాళికలతో ప్రభుత్వం ఒకవైపు ముందుకు సాగుతూనే, వ్యవసాయం మరియు ప్రకృతిపై ఆధారపడిన భారతీయ సనాతన సంస్కృతిని గౌరవిస్తున్నట్లు ఈ యాగం చాటిచెప్పింది. ఎల్ నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో, ప్రకృతి అనుగ్రహాన్ని కోరుతూ ప్రభుత్వం ఈ మహత్కార్యానికి శ్రీకారం చుట్టింది.

*అన్నదాతల ముఖాల్లో చిరునవ్వులే మా ధ్యేయం: సీఎం రేవంత్ రెడ్డి:
యాగా అనంతరం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఉద్వేగభరితంగా ప్రార్థించారు.

“రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలి. కృష్ణా, గోదావరి నదులు నిండుగా ప్రవహించాలి.”

  • “శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటు రాష్ట్రంలోని ప్రతీ ప్రాజెక్టు, చెరువు, కుంట జలకళతో కళకళలాడాలి.”
  • “భూగర్భ జలాలు ఊపందుకుని, పంటలు బంగారంగా పండాలి.. అన్నదాతల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.”
  • “ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లేలా వరుణ దేవుడు కరుణించాలి.” అని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
    ఈ చారిత్రాత్మక యాగంలో ఉత్తంకుమార్ రెడ్డి దంపతులు,శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీమతి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు శ్రీ కె. కేశవ రావు, శ్రీ పి. సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీ కె. జానారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు మరియు వేలాదిగా భక్తులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments