వరల్డ్ మస్కిటో డే సందర్భంగా జీహెచ్ఎంసీ సర్కిల్–12 ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
ఎల్బీనగర్:
ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా జీహెచ్ఎంసీ సర్కిల్–12 పరిధిలో ప్రజలకు దోమల నిర్మూలన, దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ప్రజలకు దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, ఖాళీ కంటైనర్లు, ప్లాస్టిక్ వస్తువుల్లో నీరు నిల్వ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ముఖ్యంగా నిల్వ నీటిలో దోమల లార్వా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు కోరారు.డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నియంత్రణకు కేవలం ప్రభుత్వ సిబ్బంది చర్యలు సరిపోవని, ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని అధికారులు పేర్కొన్నారు. దోమల ఉత్పత్తి కేంద్రాలను గుర్తించి తొలగించడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని గణనీయంగా అరికట్టవచ్చని తెలిపారు. ప్రజలు తమ ఇళ్లలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, దోమల నివారణ చర్యలకు జీహెచ్ఎంసీ సిబ్బందికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.“దోమల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత.. పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి రక్షణ” అనే సందేశంతో ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సర్కిల్ డిప్యూటీ కమీషనర్ శ్రీకాంత్, ఏఈ రాంబాబు ఎంటమాలజీ సిబ్బంది పాల్గొన్నారు.


