Home తెలంగాణ విశ్వసనీయ వార్తలతోనే ప్రజాస్వామ్యం బలోపేతం

విశ్వసనీయ వార్తలతోనే ప్రజాస్వామ్యం బలోపేతం

0
1
  • జెన్ జీ పై సోషల్ మీడియా ప్రభావం అదికంగా ఉన్న నేపథ్యంలో యువతకు వాస్తవ, విశ్వసనీయ సమాచారాన్ని అందించాలి
  • సంచలనాత్మకత, వైరల్‌ కంటెంట్‌ కంటే విశ్వసనీయత, నైతిక ప్రమాణాలకు మీడియా ప్రాధాన్యం ఇవ్వాలి
  • ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్‌ జాతీయ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో గవర్నర్‌ శ్రీ శివ ప్రతాప్‌ శుక్లా

హైదరాబాద్‌,

డిజిటల్‌ యుగంలో వేగం కంటే వార్తలో వాస్తవికత, నిష్పక్షపాతం , విశ్వసనీయతే అత్యంత ముఖ్యమని రాష్ట్ర గవర్నర్‌ శ్రీ శివ ప్రతాప్‌ శుక్లా అన్నారు. “ముందు నిజ నిర్ధారణ చేయాలి.. ఆ తర్వాతే వార్తను ప్రసారం చేయాలి” అని ఆయన జర్నలిస్టులకు సూచించారు.

హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్ తాజ్ కృష్ణ లో
నిర్వహిస్తున్న ఫెడరేషన్‌ ఆఫ్‌ ప్రెస్‌ క్లబ్స్‌ తొలి
జాతీయ సదస్సును గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా
ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రెస్‌ క్లబ్‌ల ప్రతినిధులకు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా గవర్నర్ ప్రెస్‌ క్లబ్స్‌ ప్రతినిధులు జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడారు.

మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభం మాత్రమే కాదని, సమాజానికి కళ్లు, చెవులు, ప్రజల గొంతుక అని గవర్నర్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టులను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, సామాజిక భద్రత, వృత్తిపరమైన అభివృద్ధికి ఫెడరేషన్‌ దోహదపడాలని ఆకాంక్షించారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా అనలిటిక్స్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానాలు జర్నలిజానికి కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని, అదే సమయంలో డీప్‌ఫేక్స్‌, ఏఐ రూపొందించిన వీడియోలు, తప్పుడు సమాచారంతో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. సోషల్‌ మీడియా ద్వారా సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జర్నలిస్టుల బాధ్యత మరింత పెరిగిందన్నారు.

సోషల్‌ మీడియా ప్రభావంతో జెన్‌–జీ ఆలోచనా విధానం మారుతోంది – యువతకు వాస్తవ, విశ్వసనీయ సమాచారాన్ని అందించడంలో జర్నలిస్టుల పాత్ర కీలకం అన్నారు. వేగం కంటే వాస్తవ నిర్ధారణ ముఖ్యం అని పేర్కొన్న గవర్నర్ సోషల్‌ మీడియా ట్రెండ్స్‌, ఫేక్‌ న్యూస్‌కు లోనుకాకుండా ప్రజా ప్రయోజనమే లక్ష్యంగా వార్తలు అందించాలనీ జర్నలిస్టులను కోరారు. సంచలనాత్మకత, వైరల్‌ కంటెంట్‌ కంటే విశ్వసనీయత, నైతిక ప్రమాణాలకు మీడియా ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

ఫేక్‌ న్యూస్‌ను ఎదుర్కొనేందుకు డిజిటల్‌ లిటరసీ, ఏఐ లిటరసీ, ఫ్యాక్ట్‌ చెకింగ్‌ వంటి అంశాలపై ఫెడరేషన్‌ అవగాహన పెంచాలని సూచించారు. తప్పుడు సమాచారాన్ని అరికట్టడం ప్రభుత్వం ఒక్కదాని బాధ్యత మాత్రమే కాదని, మీడియా, సాంకేతిక సంస్థలు, పౌరులందరి సమష్టి బాధ్యత అని స్పష్టం చేశారు.

‘నశా ముక్త్‌ భారత్‌’, ‘టీబీ ముక్త్‌ భారత్‌’ వంటి జాతీయ కార్యక్రమాలను ప్రజా ఉద్యమాలుగా మలచడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. తమ రచనలు, వార్తా సంస్థలు, డిజిటల్‌ వేదికల ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జర్నలిస్టులను కోరారు.

ఫెడరేషన్‌ రాజకీయాలకు అతీతంగా సమ్మిళిత, ప్రజాస్వామ్య వేదికగా ఎదగాలని గవర్నర్‌ ఆకాంక్షించారు. జాతీయ సదస్సు భారతీయ జర్నలిజాన్ని మరింత బలోపేతం చేసి, విశ్వసనీయంగా, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా తీర్చిదిద్దే దిశగా దోహదపడాలని ఆయన ఆకాంక్షించారు.

కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ శ్రీ కె. శ్రీనివాస్‌ రెడ్డి, గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం. దానకిశోర్‌, హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు శ్రీ ఎస్‌. విజయ్‌కుమార్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీ వి. రమేష్‌, ‘ద హిందూ’ గ్రూప్‌ పబ్లిషింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ శ్రీ ఎన్‌. రామ్‌, ఫెడరేషన్‌ ఆఫ్‌ ప్రెస్‌ క్లబ్స్‌ అధ్యక్షుడు శ్రీ గౌతమ్‌ లాహిరీ, తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here