- గ్రేటర్ నగరంలో అట్టహాసంగా మట్టి విగ్రహాల పంపిణీ
- ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాలుష్యంపై ప్రపంచ పర్యావరణ సంస్థ హెచ్చరిక
హైదరాబాద్:
ప్రకృతిని కాపాడుకోవడం ద్వారానే దైవ సంరక్షణ సాధ్యమని, భావితరాల మనుగడ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించాలని ప్రపంచ పర్యావరణ సంస్థ అధ్యక్షులు డాక్టర్ సి.హెచ్. భద్ర పిలుపునిచ్చారు. హైదరాబాద్ మహానగరంలోని కృష్ణకాంత్ పార్క్ వద్ద తెలుగు ఫోక్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారుల సమక్షంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.
గత పదిహేనేళ్లుగా ప్రపంచ పర్యావరణ సంస్థ దేశంలోని అనేక రాష్ట్రాలలో మట్టి గణపతి మహాగణపతి ఉద్యమాన్ని నిర్వహిస్తోందని డాక్టర్ భద్ర తెలిపారు. రసాయనాలతో కూడిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ) విగ్రహాల కారణంగా చెరువులు, సరస్సులు, కుంటలు, నదులు, మహాసముద్రాలు పూర్తిగా కాలుష్య మయం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అత్యంత కాలుష్య పూరిత నగరాల జాబితాలో భారతదేశం ముందు వరుసలో ఉందని, జల వనరులలోని జీవవైవిధ్యం (ఈకో సిస్టం) అంతరించే దశకు చేరుకుందని హెచ్చరించారు. విష రసాయనాలతో తయారైన విగ్రహాల అవశేషాలను జలచరాలు ఆహారంగా స్వీకరించి మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సముద్రాల ఉష్ణోగ్రతలు నిరంతరం పెరగడం వల్లే భయంకరమైన వాతావరణ విపత్తులు సంభవిస్తున్నాయని చెప్పారు. ప్రకృతిని రక్షించడమే అన్ని మతాల ప్రధాన కర్తవ్యమని, ఈ మహా ఉద్యమంలో ప్రజలు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు, మత పెద్దలు, మీడియా ప్రతినిధులు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
*కళాకారుల మట్టి గణపతి ప్రతిజ్ఞ:
తెలుగు ఫోక్ ఇండస్ట్రీ వ్యవస్థాపక అధ్యక్షులు మున్నాభాయ్ ఆధ్వర్యంలో ఆరు రాష్ట్రాలకు చెందిన వందలాది మంది కళాకారులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతినే పూజిస్తామని ఈ సందర్భంగా వారందరూ ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేశారు.
*పదివేల విగ్రహాల పంపిణీ లక్ష్యం:
ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 కేంద్రాలలో పదివేల మట్టి విగ్రహాలను పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ముఖ్య సలహాదారులు, హైదరాబాద్ ఆర్డీవో కే. రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి నిఖిల్ సాయి, కోశాధికారి కోనేటి రిజ్వాన్, జాతీయ కార్యదర్శి సి.హెచ్. సాగర్ నేత, స్పోర్ట్స్ విభాగం అధ్యక్షులు అహ్మద్, సీఎస్ఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హరీష్, స్కూల్స్ ప్రోగ్రామ్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఏ. జోష్నారావు, సీనియర్ ఉపాధ్యక్షులు పవన్ కుమార్ వడ్లకొండ, ఎన్. సంతోష్ కుమార్, గడిపోయిన ఉపేందర్ యాదవ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు భారత్, కూరపాటి మనోజ్ నేత, ఎల్. అజయ్ రెడ్డి, సహాయ కార్యదర్శి మిట్టపల్లి రామకృష్ణ రవీందర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.


