Tuesday, September 29, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్విద్యారంగంలో విప్లవాత్మక మార్పులే తెలంగాణ భవితకు భరోసా - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులే తెలంగాణ భవితకు భరోసా – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

  • నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన అజెండా
  • కేంద్ర ప్రభుత్వ విధానాలపై ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో విమర్శలు
  • మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠశాలల నుంచి నైపుణ్య విశ్వవిద్యాలయాల వరకు సమూల ప్రక్షాళన

హైదరాబాద్

ఢిల్లీ వేదికగా ప్రతిదిన్ మీడియా నెట్‌వర్క్, అస్సాం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ది కాన్‌క్లేవ్ 2026’ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొని ప్రసంగించారు. దేశంలో, రాష్ట్రంలో విద్యారంగం, ఉపాధి అవకాశాలు, రాజకీయ పరిణామాలపై ఆయన తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు.

*విద్యారంగంలో ప్రాధాన్యతలు – చదువుతోనే ఉన్నత స్థానాలు
స్వాతంత్ర్యానంతరం దేశంలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ విద్యకు, సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారని సీఎం గుర్తుచేశారు. విద్య ప్రాముఖ్యతను వివరిస్తూ, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించే స్థాయికి, డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశ ప్రధాని స్థాయికి, డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం రాష్ట్రపతి స్థాయికి ఎదిగారంటే కేవలం చదువు మాత్రమే కారణమని తెలిపారు. ప్రస్తుత తరుణంలో నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
తెలంగాణలో నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యకు పెద్దపీట వేస్తున్నామని, విద్యార్థులు భావవ్యక్తీకరణలో ఎదుర్కొంటున్న ఆత్మన్యూనతా భావాన్ని తొలగించడానికి ప్రాథమిక స్థాయి నుంచే కమ్యూనికేషన్ నైపుణ్యాలపై దృష్టి సారించామని తెలిపారు.

*యువతకు ఉపాధి – నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట
రాష్ట్రంలో ఏటా దాదాపు 1.80 లక్షల మంది ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకుని వస్తున్నప్పటికీ, కేవలం 20 వేల మంది మాత్రమే సరైన ఉద్యోగాలు పొందుతున్నారని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం డిగ్రీ సర్టిఫికెట్ల కోసం కాకుండా నైపుణ్యాలు నేర్చుకోవాలని యువతకు పిలుపునిచ్చారు.

  • యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ: 12వ తరగతి తర్వాత నైపుణ్య శిక్షణ కోసం ఈ విశ్వవిద్యత్శాలను ఏర్పాటు చేశామని, దీనికి ఆనంద్ మహీంద్రా చైర్మన్‌గా, శ్రీని రాజు వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కార్పొరేట్ దిగ్గజాల భాగస్వామ్యంతో వంద శాతం ఉద్యోగావకాశాలు కల్పించేలా కోర్సులను రూపొందిస్తున్నామన్నారు.
  • ఏటీసీలుగా ఐటీఐల అప్‌గ్రేడ్: 1956 నాటి పాత సిలబస్‌లను మార్చి, టాటా గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుని ప్రతి నియోజకవర్గంలో అధునాతన శిక్షణా కేంద్రాలను (ఏటీసీ) ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
  • అంతర్జాతీయ అవకాశాలు: కృత్రిమ మేధస్సు (ఏఐ) రాకతో వైట్ కాలర్ ఉద్యోగాల కాలం చెల్లిందని, భవిష్యత్‌లో బ్లూ కాలర్ జాబ్స్‌కు భారీ డిమాండ్ ఉంటుందని తెలిపారు. జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా దేశాల్లోని అవకాశాలను దక్కించుకునేందుకు వీలుగా ఆయా దేశాల భాషలలో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు.

*కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు:
రాష్ట్రాల అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సరళత లేని విధానాలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎంతో సహకరించారని, కానీ ప్రస్తుత ప్రధాని మోదీ మాత్రం తెలంగాణ అభివృద్ధికి సహకరించడం లేదని ఆరోపించారు. రీజనల్ రింగ్ రోడ్డు టెండర్ల సమయంలో కేంద్రం అడ్డంకులు సృష్టించిందని విమర్శించారు. ఉత్తర ప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని, నిధులను మాత్రం గుజరాత్‌కు తరలించుకుపోతున్నారని మండిపడ్డారు. ఇది ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య భేదం కాదని, గుజరాత్ వర్సెస్ దేశం అన్నట్లుగా మారిందని ధ్వజమెత్తారు. డీలిమిటేషన్ ప్రక్రియలో జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే చిన్న రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని హెచ్చరించారు.

ఓటర్ల తొలగింపు అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, దేశంలో 2029 ఎన్నికల కోసం సుమారు 13 కోట్ల ఓట్లను తొలగించారని ఆరోపించారు. బ్రిటీషర్లు సైమన్ కమిషన్‌ను తీసుకొచ్చినట్లుగా, కేంద్రం ఎన్నికల సంఘాన్ని వాడుకుంటోందని మండిపడ్డారు. నాటి ‘సైమన్ గో బ్యాక్’ నినాదంతో దేశమంతా ఏకమైనట్లే, ‘ఎస్.ఐ.ఆర్ గో బ్యాక్’ నినాదంతో దేశమంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.

*సంక్షేమం – అభివృద్ధి సమతుల్యత
రాజకీయాల్లో సంక్షేమ పథకాల పోటీ గురించి మాట్లాడుతూ… ప్రత్యర్థులు ఫుట్‌బాల్, హాకీ ఆడుతున్నప్పుడు తాను కూడా అదే రీతిలో స్పందించక తప్పదని పేర్కొన్నారు. సంక్షేమం, గ్యారెంటీలు వద్దంటున్న బీజేపీ నాయకులే, మోదీ పేరు చెబితేనే సంక్షేమం గ్యారెంటీ అని చెబుతుండటంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వేతనాలు, పింఛన్లు, సంక్షేమ పథకాలకు పోను అభివృద్ధికి నిధులు ఎలా సర్దుబాటు చేయాలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments