- యుద్ధ ప్రాతిపదికన పూడికతీత, లోతు పెంపు పనుల పూర్తి
- దసరా కానుకగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
- క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్:
రాజధాని నగరంలో దెబ్బతిన్న జల వనరులకు పూర్వ వైభవం తెచ్చే లక్ష్యంతో సాగుతున్న యజ్ఞంలో మరో మైలురాయి ఆవిష్కృతమైంది. నగరంలోని తమ్మిడికుంటతో పాటు సున్నం చెరువుల స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసి, వాటి పరిసరాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. ఆటంకాలు, అవరోధాలను ఎదుర్కొంటూ చేపట్టిన ఈ పునరుద్ధరణ పనుల ప్రగతిని మంగళవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
చెరువుల్లో పూడికను పూర్తి స్థాయిలో తొలగించి, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేలా లోతును వృద్ధి చేసిన తీరుపై కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే విజయదశమి పండుగ పవిత్ర దినాలలో ఈ రెండు చారిత్రక జలాశయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రజలకు అంకితం చేయనున్న నేపధ్యంలో, అక్కడ జరుగుతున్న తుది మెరుగుల పనులను ఆయన సమీక్షించారు.
*సౌకర్యాల మెరుగు – రవాణా అనుసంధానం
సున్నం చెరువు ఇన్‌లెట్ కాలువ నిర్మాణంతో పాటు, అక్కడ నూతన కల్వర్టును నిర్మించి వెంటనే రహదారి పనులను పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. గాయత్రినగర్, బోరబండ ప్రాంతాల నుంచి చెరువు వైపునకు వచ్చే రహదారులను విస్తరించి, మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. చెరువుల చుట్టూ పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, ఆహ్లాదకరమైన పాత్‌వేలను నిర్మించడం మరియు పచ్చదనాన్ని (గ్రీనరీ) భారీగా పెంచే కార్యక్రమాలను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. అలాగే, సున్నం చెరువును ఆనుకుని ఉన్న ప్రాచీన ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించారు.
*హర్షం వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు
పూర్వపు సున్నం చెరువు రూపానికి, నేడు హైడ్రా ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న తీరుకు పొంతనే లేదని స్థానిక ప్రజలు సంతోషం వెలిబుచ్చారు. ఎన్-కన్వెన్షన్ వంటి భారీ అక్రమ కట్టడాలను తొలగించి తమ్మిడికుంటను రక్షించిన వైనాన్ని, నేడు అది నయన మనోహరంగా మారుతున్న తీరును ప్రజలు కొనియాడారు. చెరువు నిండా నీరు చేరితే ఈ ప్రాంతం మహాద్భుతమైన పర్యాటక ప్రదేశంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ, హైడ్రా యంత్రాంగానికి ఘనంగా కృతజ్ఞతలు తెలిపారు.
త్వరలో ప్రారంభం కానున్న ఈ రెండు చెరువుల వద్ద చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో కలిసి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఇరు శాఖల ఉన్నతాధికారులు పాల్గొని, ప్రారంభోత్సవ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించారు.



