కొరతను అధిగమించేలా అదనపు నీటి వనరులు, ప్రజా చైతన్యానికి 60 రోజుల కార్యాచరణ: సంజయ్ జాజు.
హైదరాబాద్
ఎల్-నినో ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ కోర్ ఏరియాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. నగర జనాభా నీటి అవసరాలను తీర్చేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధమైంది. అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు, ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని పిలుపునిచ్చింది. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో భాగ్యనగర తాగునీటి సరఫరా సన్నద్ధతపై సమగ్ర చర్చ జరిగింది.

లభ్యత 560 ఎంజీడీలు.. అదనంగా మరో 60 ఎంజీడీల సమకూర్పు:
ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, మంజీరా, కృష్ణా, గోదావరి మూలాల ద్వారా నగరానికి ప్రతిరోజూ 560 ఎంజీడీల నీటి లభ్యత ఉంది. పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో 60 ఎంజీడీల నీటిని సమకూర్చుకునేందుకు ప్రణాళికను ఖరారు చేశారు.
- కృష్ణా జలాలు: అదనంగా 15 ఎంజీడీలు
- మిషన్ భగీరథ: 20 ఎంజీడీలు + అదనంగా మరో 20 ఎంజీడీలు
- జంట జలాశయాలు: ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల నుంచి చెరో 5 ఎంజీడీలు
- మల్లన్నసాగర్ ప్రత్యామ్నాయం: నవంబర్ నాటికి పైప్‌లైన్ పనులు పూర్తయితే అక్కడి 5 టీఎంసీల నిల్వల నుంచి అదనంగా మరో 20 ఎంజీడీల నీటిని పొందే అవకాశముంది.
పడిపోయిన భూగర్భ జలాలు — పెరుగుతున్న ట్యాంకర్ల గిరాకీ
గత రెండు మూడు నెలలుగా నగరంలో భూగర్భ జలమట్టాలు గణనీయంగా క్షీణించడంతో నీటి ట్యాంకర్లకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో మంజీరా, సింగూరు పరిధిలోని మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో బోరుబావులు, ఇతర జల వనరులను గుర్తించి నీటి సరఫరాకు ప్రణాళికలు రూపొందించారు. తాగునీటి విభాగానికి అవసరమైన నిధుల కేటాయింపులో ఎలాంటి ఇబ్బందులు లేవని, అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు.
నీటి పొదుపుతో రోజుకు 80 ఎంజీడీల ఆదా — 60 రోజుల ప్రత్యేక ప్రచారం:
నగర నివాసులు తమ దైనందిన వాడకంలో కేవలం 20 శాతం నీటిని పొదుపు చేస్తే, ప్రతిరోజూ 80 ఎంజీడీల నీరు ఆదా అవుతుందని అంచనా వేశారు. తాగునీటితో వాహనాలు కడగడం, పరిసరాలను శుభ్రం చేయడం వంటి వృథా చర్యలపై నిఘా ఉంచనున్నారు.
- ప్రజా చైతన్యం: నీటి ప్రాధాన్యంపై 60 రోజుల పాటు విస్తృత స్థాయిలో చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ప్రచారంలో నటులు, ప్రముఖులను భాగస్వాములను చేయనున్నారు.
- మరుజలాల పునర్వినియోగం: నివాస సముదాయాల్లోని మురుగునీటి శుద్ధి కేంద్రాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చి, శుద్ధి చేసిన నీటిని మొక్కల పెంపకానికి, వాహనాల శుభ్రతకు మాత్రమే వాడేలా నిబంధనలు అమలు చేయనున్నారు. ఈ అవసరాల కోసం ప్రత్యేకంగా పచ్చటి ట్యాంకర్లను అందుబాటులోకి తేనున్నారు.
నగరంలో ప్రతి నీటి చుక్కను ప్రాణవాయువులా కాపాడుకోవడం ద్వారానే ఎల్-నినో విసిరే సవాలును అధిగమించగలమని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.


