హైదరాబాద్:
హైదరాబాద్‌లో ఏసీబీ అధికారులు మెరుపు తనిఖీలు నిర్వహించారు. ఖైరతాబాద్‌లోని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWS&SB) జాయింట్ డైరెక్టర్ ఎ. శ్రీనివాస్ వద్ద లెక్కల్లో చూపని రూ.2.40 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఏసీబీ అధికారిక ప్రకటన ప్రకారం.. అక్టోబర్ 24 సాయంత్రం రాజ్‌భవన్ రోడ్డులో శ్రీనివాస్ ప్రయాణిస్తున్న మారుతి స్విఫ్ట్ కారును (టీఎస్ 08 జిక్యూ 3699) ఏసీబీ సిటీ రేంజ్-2 బృందం అడ్డుకుని తనిఖీ చేసింది. తనిఖీల్లో 2 లక్షల 40 వేల రూపాయలు నగదు లభించింది. అతడి వద్ద స్వాధీనం చేసుకున్న నగదుకు సంబంధించి శ్రీనివాస్ సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోవడంతో ఏసీబీ అధికారులు నగదును జప్తు చేసి పంచనామా నిర్వహించారు. అనంతరం ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం అందించారు.ఈ వ్యవహారంపై అవినీతి నిరోధక చట్టం కింద తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.


