- నగర కమిషనరేట్ పరిధిలోని 38 కేంద్రాల్లో మెగా శిబిరాలు
- సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల మహోన్నత త్యాగాలకు నివాళిగా హైదరాబాద్ సిటీ పోలీస్ గురువారం మెగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసింది. రోడ్డు ప్రమాదాల క్షతగాత్రులు, తలసేమియా చిన్నారులు, క్యాన్సర్ రోగుల అత్యవసర చికిత్సలకు అండగా నిలిచేందుకు నగరవ్యాప్తంగా 38 కేంద్రాల్లో ఈ బృహత్తర కార్యక్రమాన్ని తలపెట్టింది. సుమారు 30 బ్లడ్ బ్యాంకుల సహకారంతో దాదాపు 5,700 యూనిట్ల రక్తాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుని ఈ శిబిరాలను కొనసాగిస్తోంది.
ఇందులో భాగంగా పేట్లబురుజులోని సీఏఆర్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన కేంద్రాన్ని రాష్ట్ర డీజీపీ శ్రీ సీవీ ఆనంద్, ఐపీఎస్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు నగర పౌరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీజీపీ శ్రీ సీవీ ఆనంద్, ఐపీఎస్ గారు మాట్లాడుతూ.. అక్టోబరు 21 నుంచి 31 వరకు అమరవీరుల స్మరణార్థం రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమాజ రక్షణ కోసం పండుగలు, సెలవులను సైతం విడిచిపెట్టి పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం త్యాగనిరతి చాటుకుంటున్నారని కొనియాడారు. ప్రాణదానంతో సమానమైన రక్తదానాన్ని ఉద్యమంలా చేపట్టి, సేకరించిన రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు అందించడం ఎంతో అభినందనీయమన్నారు. ముఖ్యంగా తలసేమియా బాధితులకు, ప్రమాదాల్లో గాయపడిన వారికి ఈ రక్తం సంజీవనిలా ఉపయోగపడుతుందన్నారు. ఇదే సమయంలో రక్తదానం, అవయవదానంపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగేలా ప్రైవేటు ఆసుపత్రులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు మాట్లాడుతూ.. అమరుల త్యాగాలను స్మరిస్తూ వారికి నిజమైన నివాళి అర్పించాలనే సంకల్పంతోనే కమిషనరేట్ పరిధిలో పెద్దఎత్తున ఈ శిబిరాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ మహత్కార్యానికి సహకరించిన ఉస్మానియా, గాంధీ, నిమ్స్, కింగ్ కోఠి, నిలోఫర్, ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్స్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులకు, అలాగే రెడ్ క్రాస్, తలసేమియా ఫౌండేషన్, రోటరీ, లయన్స్ క్లబ్ వంటి స్వచ్ఛంద సంస్థలకు, రక్తదాతలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ (క్రైమ్) శ్రీ ఎం. శ్రీనివాసులు ఐపీఎస్ ,అడిషనల్ సీపీ (లా అండ్ ఆర్డర్) శ్రీ తప్సీర్ ఇక్బాల్ ఐపీఎస్, , జాయింట్ సీపీ (ట్రాఫిక్) శ్రీ జోయల్ డేవిస్ ఐపీఎస్, డీసీపీ (సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్) శ్రీ ఆర్. వెంకటేశ్వర్లు ఐపీఎస్, శ్రీ.రాహుల్ హెడ్గే ఐపిఎస్ డిసిపి ట్రాఫిక్, విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ శ్రీమతి లావణ్యనాయక్ జాదవ్ గారితో పాటు అన్ని జోన్ల డీసీపీలు, ఇతర అధికారులు, బ్లడ్ బ్యాంకులకు చెందిన వైద్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు.




