Friday, November 6, 2026
Google search engine
Homeతెలంగాణఅక్రమ ఫైనాన్స్ ముఠాపై ఎస్‌ఓటీ కొరడా!

అక్రమ ఫైనాన్స్ ముఠాపై ఎస్‌ఓటీ కొరడా!

  • నలుగురు మహిళలు అరెస్ట్‌..
  • ఇప్పటివరకు ఏడుగురు నిందితులు పట్టివేత
  • రుణాల పేరుతో పేదలు, వృద్ధులే టార్గెట్‌..
  • అధిక వడ్డీతో అమాయకుల వద్ద ఆర్థిక దోపిడీ

ఎల్బీనగర్‌:

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలు, వృద్ధులు, ఉద్యోగులు, వ్యాపారులను టార్గెట్‌ చేసుకుని రుణాల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠాపై ఎస్‌ఓటీ ఎల్బీనగర్‌ జోన్‌ పోలీసులు కొరడా ఝళిపించారు. ఈ వ్యవహారంలో మరో నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. గత నెల 26న ముగ్గురిని అరెస్ట్‌ చేయగా, తాజాగా మరో నలుగురిని పట్టుకున్నారు. దీంతో ఇప్పటివరకు ఏడుగురు నిందితులు పోలీసులకు చిక్కారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

రుణాల పేరుతో నమ్మించి మోసం

పోలీసుల వివరాల ప్రకారం.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి పెద్ద మొత్తంలో రుణాలు ఇప్పిస్తామని నిందితులు నమ్మించేవారు. పరిచయస్తులు, మధ్యవర్తుల ద్వారా బాధితులను సంప్రదించి, రుణం మంజూరు చేసే ముందే వడ్డీ పేరుతో భారీ మొత్తాలు వసూలు చేసేవారు. కొన్ని సందర్భాల్లో హామీ ఇచ్చిన రుణంలో కొంత మొత్తమే ఇచ్చి, మిగతా రుణం ఇప్పిస్తామంటూ మరిన్ని డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.వాస్తవంగా ఇచ్చిన రుణం కంటే చాలా ఎక్కువ మొత్తాలకు ప్రామిసరీ నోట్లు, బాండ్లు, భూమి పాస్ బుక్కులు, సంతకం చేసిన ఖాళీ చెక్కులు తీసుకునేవారు. బాధితులు రుణాలు తిరిగి చెల్లించినా పత్రాలు తిరిగి ఇవ్వకుండా, అదనపు డబ్బులు డిమాండ్‌ చేసేవారని పోలీసులు తెలిపారు. డబ్బులు అడిగినా, పత్రాలు తిరిగి ఇవ్వాలని కోరినా క్రిమినల్‌ కేసులు పెడతామని, శారీరకంగా హాని చేస్తామని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

వృద్ధ మహిళా వైద్యురాలికి కూడా టోకరా

ఏఐ ఆధారిత క్యాన్సర్‌ గుర్తింపు యంత్రం కొనుగోలు చేయాలనుకున్న వృద్ధ మహిళా వైద్యురాలికి ఆర్థిక సహాయం చేస్తామని నమ్మించి మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె నుంచి డబ్బులు వసూలు చేయడంతో పాటు పలు ఆర్థిక పత్రాలు తీసుకుని, స్కోడా కారు, టయోటా ఇన్నోవా హైక్రాస్‌ వాహనాలను బలవంతంగా స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇదే తరహాలో ఓ ప్రైవేట్‌ ఉపాధ్యాయుడు, డ్రైవర్‌, అతని స్నేహితుడు, పదవీ విరమణ చేసిన పశుసంవర్ధక శాఖ ఉద్యోగి కూడా ఆర్థిక దోపిడీ, బెదిరింపులకు గురైనట్లు పోలీసులు తెలిపారు.

భారీగా పత్రాలు, నగదు స్వాధీనం

నిందితుల నుంచి టయోటా ఇన్నోవా హైక్రాస్‌, స్కోడా కారుతో పాటు 9 మొబైల్‌ ఫోన్లు, అదనంగా మూడు స్మార్ట్‌ఫోన్లు, రూ.47,690 నగదు, రెండు తెలంగాణ పట్టాదారు పాస్‌ పుస్తకాలు, 25 ప్రామిసరీ నోట్లు, 22 ఖాళీ చెక్కులు, రెండు సేల్‌ డీడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరో 20 మంది బాధితులపై ఆరా

ఈ వ్యవహారంలో ఎల్బీనగర్‌, నేరేడ్‌మెట్‌, కీసర పోలీస్‌ స్టేషన్లలో మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఏడుగురు బాధితులను గుర్తించి విచారించగా, మరో 20 మంది సంభావ్య బాధితుల వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.నిందితుల ఆర్థిక లావాదేవీలు, ముఠాలో ఇతరుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.
అక్రమ ఫైనాన్స్‌, అధిక వడ్డీ వసూళ్లు, బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రుణాలు తీసుకునే సమయంలో ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, బాండ్లపై సంతకాలు చేయవద్దని ప్రజలకు సూచించారు.మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ బి. సుమతి, ఐపీఎస్‌ పర్యవేక్షణలో, ఎల్బీనగర్‌ జోన్‌ డీసీపీ బి.అనురాధ మార్గదర్శకత్వంలో ఎస్‌ఓటీ, ఎల్బీనగర్‌ పోలీసుల బృందాలు ఈ చర్యలు చేపట్టాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments