ఏడు నెలలుగా పెట్రోల్ అలవెన్సులు అందగా తీవ్ర ఆవేదనలో ఉద్యోగులు ..
కోర్ అర్బన్ రీజియన్ పునర్వ్యవస్థీకరణతో నిలిచిన నిధులు.. కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించిన బీఎమ్ఈయూ (బీఎమ్ఎస్)
హైదరాబాద్:
కోర్ అర్బన్ రీజియన్ పునవ్యవస్థీకరణ ప్రక్రియ బల్దియా ఫీల్డ్ స్థాయి సిబ్బందికి శాపంగా మారింది. గడిచిన ఏడు నెలలుగా పెట్రోల్ అలవెన్సులు విడుదల కాకపోవడంతో క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై భాగ్యనగర మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ (బీఎమ్ఈయూ – బీఎమ్ఎస్) ప్రతినిధులు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు.
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎంఎస్ నంబర్ 35 ప్రకారం కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పేరుతో మూడు మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే కార్పొరేషన్ల విభజన, పాలనాపరమైన సర్దుబాట్ల కారణంగా ఏప్రిల్ 2026 నుండి అక్టోబర్ 2026 వరకు రావలసిన ప్రయాణ, పెట్రోల్ అలవెన్సుల చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి.
రోజువారీ క్షేత్ర పరిశీలన, పారిశుధ్య పర్యవేక్షణ, పన్నుల వసూలు, తపాల్ నిర్వహణ వంటి అత్యవసర బాధ్యతలు నిర్వహించే జవాన్లు, శానిటరీ జవాన్లు, బిల్ కలెక్టర్లు, టాక్స్ ఇన్స్పెక్టర్లు, ఆఫీస్ సబోర్డినేటర్లు నిత్యం స్వసొంత ఖర్చులతోనే వాహనాల్లో తిరగాల్సి వస్తోంది. ఏడు నెలలుగా ప్రయాణ అలవెన్సులు అందకపోవడంతో జీతంలో అధిక భాగం ఇంధన ఖర్చులకే వెచ్చించాల్సి వస్తోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ, విభజన ప్రక్రియ నెమ్మదించినా ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన అలవెన్సులను వెంటనే విడుదల చేయాలని కోరారు. క్షేత్రస్థాయి విధులకు ఇంధన అలవెన్స్ ప్రాథమిక అవసరమని, బకాయి పడిన ఏడు నెలల నిధులను వెంటనే మంజూరు చేసి సిబ్బందికి ఉపశమనం కలిగించాలని విజ్ఞప్తి చేశారు.


