జేడీ లక్ష్మీనారాయణ
ఎల్బీనగర్ చంపాపేట
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఇంటర్మీడియట్ విద్య ఎంతో కీలకమని మాజీ ఐపీఎస్ అధికారి వి.వి. లక్ష్మీనారాయణ (జేడీ) అన్నారు. చంపాపేటలోని విజయ కన్వెన్షన్‌లో వేదాంత్ ఐఐటీ–నీట్ అకాడమీ, శ్రీ ఆకాశ్ నూతన కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేడీ లక్ష్మీనారాయణ విద్యార్థులను ఉద్దేశించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలను ఎంతో శ్రద్ధతో, క్రమశిక్షణతో చదవాలని సూచించారు. అయ్యప్ప దీక్షను 41 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ఆచరించినట్లుగానే, విద్యార్థులు కూడా రెండేళ్లపాటు చదువుపై దీక్షతో దృష్టి సారించి ఉన్నత ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఇతరులతో పోటీ పడటం కంటే తమతో తామే పోటీ పడుతూ, ప్రతి రోజూ కొత్త విషయాలు నేర్చుకోవాలని చెప్పారు.
సబ్జెక్టులపై పూర్తి అవగాహన పెంచుకోవడంతో పాటు నిరంతర అభ్యాసం అవసరమని, సెల్‌ఫోన్లకు దూరంగా ఉంటూ లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలని సూచించారు. మనం ఎంచుకునే కళాశాల కూడా భవిష్యత్తు రూపుదిద్దుకోవడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. జీవితాంతం విద్యార్థులుగానే ఉంటూ కొత్త విషయాలను తెలుసుకునే ఆసక్తిని ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని అన్నారు.
అమ్మాయిలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని జేడీ ప్రశంసించారు. దేశ అభివృద్ధి నేటి యువతపై ఆధారపడి ఉందని, విద్యార్థులు ఉన్నతంగా ఎదిగి తల్లిదండ్రులు గర్వపడేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం ప్రతినిధి వై. రాజేందర్ రెడ్డిని జేడీ ప్రత్యేకంగా అభినందించారు. వేదాంత్ ఐఐటీ–నీట్ అకాడమీ ద్వారా విద్యార్థులకు ఐఐటీ, నీట్‌తో పాటు ఫౌండేషన్ కోర్సుల్లో నాణ్యమైన శిక్షణ అందించాలనే లక్ష్యంతో కళాశాలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది, పలువురు విద్యావేత్తలు పాల్గొన్నారు.


