ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధం..
ప్రియురాళ్లతో కలిసి అడ్డుతొలగించుకున్న భర్త..
ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ఘటన..
విచారణ చేపట్టిన పోలీసులు..
ఒక వ్యక్తికి ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం భార్యకు తెలియడంతో ఇద్దరు ప్రియురాళ్లతో కలిసి ఆమెను హత్య చేశాడు. భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించేందుకు ప్రయత్నించాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వ్యక్తితోపాటు ఇద్దరి ప్రియురాళ్లను అరెస్ట్ చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈ సంఘటన జరిగింది. అక్టోబరు 28న సుభశ్రీ అనే మహిళ మరణించింది. తన భార్య ఆత్మహత్యాయత్నం చేసిందని భర్త ప్రద్యుమ్న కుమార్ దాస్ ఆరోపించాడు. ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు చెప్పారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాగా, సుభశ్రీ అసహజంగా మరణించినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం కోసం ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అధిక మోతాదులో అనస్థీషియా ఇవ్వడం వల్లే ఆమె చనిపోయిందని పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. అలాగే ఆమె చేతులు, మెడపై గాయాలున్నట్లు ఆ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
మరోవైపు పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఆధారంగా దాస్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటపెట్టాడు. ఇద్దరు మహిళలతో తనకు వివాహేతర సంబంధం ఉందని పోలీసులకు తెలిపాడు. ఈ విషయం తెలిసి గొడవ పడిన భార్య సుభశ్రీ గత ఎనిమిది నెలలుగా ఆమె తల్లిదండ్రుల ఇంట్లోనే ఉందని చెప్పాడు.
అక్టోబరు 28న ఒక ప్రియురాలి ఇంట్లో కలిసేందుకు భార్య సుభశ్రీని దాస్ ఒప్పించాడని పోలీసులు తెలిపారు. ఫార్మసీలో పని చేసే పేరెంట్స్ నుంచి అనస్థీషియా ఇంజెక్షన్ సేకరించాడని చెప్పారు. రోజీ ఇంటికి వచ్చిన సుభశ్రీకి బలవంతంగా రెండు మత్తు ఇంజెక్షన్లు చేయడంతో ఆమె మరణించినట్లు పోలీసులు వివరించారు. భర్త దాస్, అతడి ఇద్దరు ప్రియురాళ్లను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.