Monday, November 2, 2026
Google search engine
Homeతెలంగాణగుండ్లపోచంపల్లి సర్కిల్ 60 లో అక్రమ అనుమతుల 'థీము కింగ్స్ కోర్టు' దందా!

గుండ్లపోచంపల్లి సర్కిల్ 60 లో అక్రమ అనుమతుల ‘థీము కింగ్స్ కోర్టు’ దందా!

  • జీఓ 131 నిబంధనలు గాల్లోకి.. ‘బిల్డ్ నౌ’ పోర్టల్ లో పారదర్శకత లేకపోవడం తో పేట్రేగిపోతున్న అవినీతి అధికారులు..
  • దొంగ లేఅవుట్లను సృష్టించి, నాలా కన్వర్షన్ లేని స్థలంలో 6 అంతస్తులు 8 టవర్లు.. 100కు పైగా ఫ్లాట్లు అమాయకులకు అమ్మి తడిగుడతో గొంతు కోస్తున్న వైనం..
  • ముడుపులు తీసుకుని చర్యలు తీసుకోలేని సర్కిల్ 60 అధికారుల,డిప్యూటీ కమిషనర్ ఎన్. సుధాంశు, టౌన్ ప్లానింగ్ విభాగం ఏసిపి భాస్కర్, టిపిఎస్ ముఖేష్ సింగ్.
  • ఆధారాలతో ఫిర్యాదులు చేసి 8 నెలలైనా కదలని టౌన్ ప్లానింగ్ యంత్రాంగం.. అధికారుల ముడుపుల మాయలో.. ప్లాట్లు కొన్న సామాన్యుల జీవితాలు బలి..
  • సి.ఎం. సి కమిషనర్, శ్రీజన, సిసిపి వెంకన్న చర్యలు ఎక్కడ..!
  • మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, మున్సిపల్ శాఖ మంత్రి, సీ.ఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి..

అవినీతి అధికారుల ముడుపుల మాయలో పాలన గాలికి కొట్టుకుపోతుంటే, నిబంధనలు అభాసుపాలవుతున్నాయి. గుండ్లపోచంపల్లి సర్కిల్ 60 లో ‘బిల్డ్ నౌ’ పోర్టల్ అక్రమార్కుల పాలిట అక్షయపాత్రగా మారింది. నాలా కన్వర్షన్, లేఅవుట్ అనుమతులు లేకున్నా.. దొంగ పత్రాలతో ‘థీము కింగ్స్ కోర్ట్’ 6 అంతస్తుల దందాకు రెడ్ కార్పెట్ పరిచారు. 8 నెలలుగా ఆధారాలతో మొరపెట్టుకున్నా, డిప్యూటీ కమిషనర్ సుధాంశు, ఏసిపి భాస్కర్, టిపిఎస్ ముఖేష్ సింగ్ కాసుల కక్కుర్తితో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారుల మౌనం చూస్తుంటే, సామాన్యుల జీవితాలను బలిపీఠంపై ఎక్కించడంలో వీరంతా భాగస్వాములేనని స్పష్టమవుతోంది!

కుత్బుల్లాపూర్:

రాష్ట్రంలో పారదర్శక పాలన అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ విధానాలను కొందరు అవినీతి అధికారులు తమ స్వార్థానికి వాడుకుంటున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో తిష్టవేసిన అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపి ‘బిల్డ్ నౌ’ వెబ్‌సైట్ పోర్టల్‌ను అక్రమ అనుమతులకు వేదికగా మార్చుకున్నారు. ఎలాంటి నాలా కన్వర్షన్, లేఅవుట్ అనుమతులు లేకపోయినా, మార్ఫింగ్ చేసిన ఎల్ఆర్ఎస్ పత్రాలు, తప్పుడు ఆధారాలతో భవన నిర్మాణ అనుమతులు జారీ చేసిన దందా గుండ్లపోచంపల్లి సర్కిల్ 60 పరిధిలో వెలుగుచూసింది.

ఎల్.ఆర్.ఎస్-2020 నిబంధనలకు పాతర
జీఓ నంబర్ 131 (తేదీ: 31-08-2020) ప్రకారం 26-08-2020 నాటికి నమోదైన హక్కులు లేదా టైటిల్ కలిగిన ప్లాట్లకే క్రమబద్ధీకరణ, భవన నిర్మాణ అనుమతులకు అర్హత ఉంటుంది. కానీ గుండ్ల పోచంపల్లి, కాజీగూడ గ్రామంలోని సర్వే నంబర్లు 10, 13లలో ఈ నిబంధనలను పూర్తి విరుద్ధంగా తొక్కి అనుమతులు మంజూరు చేశారు.

  • విక్రయ పత్రం 1: 12957/2024 (మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, లింక్డ్ AGPA నంబర్: 8159/2024)
  • విక్రయ పత్రం 2: 8251/2025
    కటాఫ్ తేదీ 26-08-2020 తర్వాత రిజిస్టర్ అయిన ఈ పత్రాల ఆధారంగా భవన నిర్మాణ అనుమతి ఏ విధంగా ఇచ్చారనేది తీవ్ర వివాదాస్పదంగా మారింది.

ఖజానాకు కోట్లలో గండి – ‘థీము కింగ్స్ కోర్ట్’ అక్రమాలు:
కాజీగూడలోని సర్వే నంబర్లు 10, 13లలో ‘థీము కింగ్స్ కోర్ట్’ పేరుతో 6 అంతస్తులు, 8 టవర్లలో 100కు పైగా ఫ్లాట్లను అక్రమ పద్ధతిలో అనుమతులు పొంది నిర్మిస్తున్నారు (అనుమతి నంబరు: 0040/BP/3140/2025). తప్పుడు పత్రాలతో అనుమతులు తెచ్చుకుని, అమాయక ప్రజలకు ఫ్లాట్లు అమ్మి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన రుసుములు ఎగ్గొట్టి, ప్రభుత్వ ఆదాయానికి కోట్లాది రూపాయల గండి కొడుతున్నారు.

ఫిర్యాదులు చేసి 8 నెలలు.. పత్రికల్లో వార్తలొచ్చినా నిశ్శబ్దమే!
ఆధారాలతో సహా వ్రాతపూర్వక ఫిర్యాదులు చేసి 8 నెలలు దాటినా, పత్రికల్లో కథనాలు వెలువడినా సర్కిల్ 60 అధికారులు స్పందించకపోవడం వెనుక భారీగా ముడుపులు అందినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గుండ్లపోచంపల్లి సర్కిల్ 60 డిప్యూటీ కమిషనర్ ఎన్. సుధామ్స్, టౌన్ ప్లానింగ్ విభాగం ఏసిపి భాస్కర్, టిపిఎస్ ముఖేష్ సింగ్ అవినీతికి కొమ్ముకాస్తూ అక్రమ నిర్మాణాలకు పరోక్షంగా సహకరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
ఉన్నతాధికారులు కమిషనర్ శ్రీజన, సీసీపీ వెంకన్న ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

బాధితులు, స్థానిక ప్రజల ముఖ్య డిమాండ్లు:

  • అనుమతుల తక్షణ రద్దు: వివాదాస్పద భవన నిర్మాణ అనుమతి చట్టబద్ధతను విచారించి వెంటనే రద్దు చేయాలి.
  • పనుల నిలిపివేత: విచారణ పూర్తయ్యే వరకు స్థలంలో జరుగుతున్న నిర్మాణ పనులను నిలిపివేస్తూ నోటీసులు ఇవ్వాలి.
  • ఏసీబీ విచారణ: ఫిర్యాదులపై 8 నెలలుగా చర్యలు తీసుకోకుండా అక్రమార్కులకు సహకరించిన అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), విజిలెన్స్ విభాగంతో విచారణ జరిపించాలి.
  • పోర్టల్ దస్త్రాల తనిఖీ: ‘బిల్డ్ నౌ’ వెబ్‌సైట్ ద్వారా గతంలో మంజూరు చేసిన అనుమతులపై సమగ్ర విచారణ జరపాలి.

ఈ భారీ కుంభకోణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ మను చౌదరి తక్షణమే స్పందించి విచారణకు ఉత్తర్వులు ఇవ్వాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments