- మధుయాష్కి గౌడ్ విశేష కృషితో దక్కిన సముచిత న్యాయం..
- తొలగిన తొమ్మిదివేలకు పైగా కుటుంబాల ఆందోళన!
హైదరాబాద్:
దశాబ్దాలుగా ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలను పీడిస్తున్న జీవో నం. 118 భూ సమస్యకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించింది. ఏళ్ల తరబడి అభద్రతాభావంలో బతుకీడ్చిన వేలాది మంది మధ్యతరగతి కుటుంబాలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం భరోసా కల్పించింది. ఈ సమస్య పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన స్పష్టమైన హామీ పట్ల ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్ పర్సన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
రెండు దశాబ్దాల వేదనకు ముగింపు
- దాదాపు ఇరవై సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని జీవో 118 బాధిత కాలనీల సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం కొలిక్కి తెచ్చింది.
- ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని సుమారు 9,500 కుటుంబాల గృహాలకు క్రమబద్ధీకరణ (రెగ్యులరైజేషన్) ద్వారా శాశ్వత విముక్తి కల్పించనున్నారు.
- రేవంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న కాలం నుంచే ఈ ప్రాంత ప్రజల ఇబ్బందిని ప్రత్యక్షంగా పరిశీలించి, పూర్తి అవగాహన కలిగి ఉండటమే ఈ త్వరితగతిన నిర్ణయానికి ప్రధాన కారణం.
*ముఖ్యమంత్రికి, మంత్రులకు విజ్ఞప్తులు.. సఫలమైన శ్రమ:
ఈ సమస్య తీవ్రతను గుర్తించిన మధుయాష్కి గౌడ్, బాధితుల తరఫున నిరంతరం పోరాటం సాగించారు. జీవో 118 బాధిత కాలనీల ప్రతినిధి బృందాన్ని వెంటబెట్టుకుని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని,

- రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని,
- జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబును
నేరుగా కలిసి వినతిపత్రాలు అందజేశారు. కాలనీవాసులు ఎదుర్కొంటున్న నరకయాతనను అధికారులకు పూసగుచ్చినట్లు వివరించి, న్యాయం చేయాలని గట్టిగా కోరారు. వారి అవిశ్రాంత కృషి ఫలితంగానే నేడు శాసనసభ వేదికగా ప్రభుత్వం సానుకూల ప్రకటన వెలువడింది.
*ప్రజా ప్రభుత్వమే పేదల రక్షక కవచం:
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి “ఎల్బీనగర్ ప్రజలకు మాటిస్తున్నాను” అంటూ ప్రకటించడం చారిత్రాత్మకమని మధుయాష్కి గౌడ్ అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ సామాన్య, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసమే పరితపిస్తుందని మరోసారి నిరూపితమైందని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో బాధిత కాలనీల్లో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ చారిత్రాత్మక విజయంపై స్థానిక ప్రజలు మరియు బాధితులు మధుయాష్కి గౌడ్ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


