Home తెలంగాణ *తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాం: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

*తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాం: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

0
2
  • *2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
  • *అమెరికాలో ఐఓసీ సమావేశంలో ఉద్ఘాటన

హైదరాబాద్ :

తెలంగాణలో కొలువుదీరిన ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని జోడెడ్లుగా ముందుకు తీసుకెళ్తోందని, రాష్ట్ర రూపురేఖలను మారుస్తూ ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా జరిగిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలను విదేశీ ప్రతినిధులు, ఎన్ఆర్ఐలకు వివరించారు.

*మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే ధ్యేయం
తెలంగాణను 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లు, రాబోయే ఐదేళ్లలో ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ ప్లాన్‌ను అమలు చేస్తోందని తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు తోడుగా నాల్గవ మహానగరంగా ముచ్చర్ల ప్రాంతంలో కాలుష్య రహిత నెట్-జీరో ప్రమాణాలతో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కోర్ అర్బన్, పెరి-అర్బన్, రూరల్ అగ్రిగా మూడు ఆర్థిక మండలాలుగా వర్గీకరించి వేగంగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.

*విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు
యువతను అంతర్జాతీయ స్థాయి నిపుణులుగా తీర్చిదిద్ది ఉపాధి కల్పించడమే ధ్యేయంగా విద్యా రంగంలో సరికొత్త ఒరవడిని తెచ్చామని వెల్లడించారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో స్కిల్స్ యూనివర్సిటీని నెలకొల్పామని, ప్రతి నియోజకవర్గంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు.
టాటా గ్రూప్ భాగస్వామ్యంతో రూ. 2,100 కోట్లతో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా కేంద్రాలను హైటెక్ డిజిటల్ శిక్షణా కేంద్రాలుగా మారుస్తున్నట్లు వివరించారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు ఉదయం పూట పౌష్టికాహార అల్పాహార పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని విస్తరించామని తెలిపారు.

*ఆక్రమణలపై ఉక్కుపాదం.. మూసీకి పూర్వవైభవం
హైదరాబాద్ మహానగరంలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చామని, ప్రకృతి వనరులను కాపాడేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. లండన్ థేమ్స్ నది తరహాలో నదీ ప్రక్షాళన ప్రాజెక్టు ద్వారా మూసీ నదిని శుద్ధి చేసి, పర్యాటక, వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ప్రారంభించామని వెల్లడించారు.
గత పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక విచ్ఛిన్నతకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన తీరు వల్ల గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 15 నుంచి 25వ తేదీ వరకు జీతాలు రాని దుస్థితి ఉండేదని గుర్తుచేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కఠినమైన ఆర్థిక క్రమశిక్షణను పాటించి, విచ్ఛిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిందని తెలిపారు. ఇప్పుడు ప్రతి నెలా మొదటి తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ చేస్తున్నామని ప్రకటించారు. అంతేకాకుండా, దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 1.20 కోట్ల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నామని వెల్లడించారు.

*ఆరు గ్యారెంటీలతో సుపరిపాలన
ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో వేగంగా అమలు చేస్తోందని, ఉచిత ప్రయాణం, రాయితీ గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు వంటి నిర్ణయాలు సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపాయని వివరించారు. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయమే పునాదిగా సాగుతున్న తెలంగాణ పునర్నిర్మాణంలో విదేశాల్లో ఉన్న తెలుగు ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ప్రాంతీయ రహదారి (ఆర్.ఆర్.ఆర్) పనులను వేగవంతం చేయడం, మెట్రో రైలు రెండో దశ విస్తరణతో పాటు అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా రాబట్టడం వల్ల తెలంగాణ తలసరి ఆదాయం రూ. 4.18 లక్షలకు చేరిందని ఆయన వివరించారు. అమెరికాలోని తెలుగు ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు స్వరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం కోరారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here