కాంట్రాక్టర్ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలకు తప్పని తిప్పలు…14 రోజులుగా నరకయాతన
ఎల్బీనగర్:
చిన్నపాటి రోడ్డు మరమ్మతుల కోసం భారీగా రోడ్డును తవ్వేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటన సరూర్నగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో చోటు చేసుకుంది. కేవలం నాలుగు అడుగుల మేర రోడ్డు ప్యాచ్ వర్క్ చేయాల్సి ఉండగా, దాదాపు 100 అడుగుల మేర బాగున్న రోడ్డును, మూడు వైపులా ప్రధాన రోడ్లను సైతం ముక్కలు చేసి తవ్వేయడంపై,స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వైట్ హౌజ్ బిల్డింగ్ నుండి డాక్టర్స్ కాలనీలోని మెయిన్ రోడ్డుకు అనుసంధానంగా ఉన్న లింక్ రోడ్డును మూడు వైపులా తవ్వేయడంతో వాహనదారులు, కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక చిన్న ప్యాచ్ వర్క్ కోసం ఇంత పెద్ద స్థాయిలో రోడ్డును తవ్వడం వెనుక కాంట్రాక్టర్ ప్రణాళిక ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
14 రోజులుగా పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే…?
గత కొన్ని రోజులనుండి సాయంత్రం సమయంలో పడే వర్షాలకు రోడ్డుపైన వేసిన సిమెంట్, కంకర కూడా నీళ్ళల్లో కొట్టుకొనిపోతున్నదని, రోడ్డు తవ్వి 14 రోజులు గడుస్తున్నా పనులు పూర్తికాకపోవడంతో ప్రజలకు నిత్యం ఇబ్బందులు తప్పడం లేదు. లింక్ రోడ్డును ఉపయోగించే వాహనదారులు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుండగా, ఇప్పటికే దెబ్బతిన్న రోడ్లపై ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారిందని స్థానికులు వాపోతున్నారు.ముఖ్యంగా రోడ్డు పక్కన ఉన్న చిన్న చిన్న కిరాణా దుకాణాల వ్యాపారాలపై కూడా ఈ పనుల ప్రభావం పడిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు తవ్వడంతో దుకాణాల వద్దకు వినియోగదారులు రావడానికి ఇబ్బంది పడుతున్నారని, ఫలితంగా గిరాకీ గణనీయంగా తగ్గిందని ఆవేదన చెందుతున్నారు.
ప్రజాధనం వృథా చేస్తున్నారా…?
అవసరమైన మేరకే రోడ్డు తవ్వి మరమ్మతులు చేయాల్సి ఉండగా, బాగున్న రోడ్డును సైతం తవ్వేయడం వల్ల ప్రజాధనం వృథా అయ్యే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంజినీరింగ్ విభాగం పర్యవేక్షణ లేకుండా కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.‘ప్యాచ్ వర్క్ రెండు అడుగులైతే.. రోడ్డు మాత్రం 100 అడుగులు ఎందుకు తవ్వారు?’ అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పనుల నాణ్యత, అంచనాలు, కాంట్రాక్టర్ పనితీరు, అధికారుల పర్యవేక్షణపై సమగ్రంగా పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు.వెంటనే పనులు పూర్తి చేయాలి
ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా రహదారులను రోజుల తరబడి తవ్వి వదిలేయకుండా, పనులను వేగంగా పూర్తి చేసి రోడ్డును ప్రయాణానికి అనువుగా మార్చాలని కాలనీవాసులు కోరుతున్నారు. సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, కాంట్రాక్టర్ పనితీరుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.చిన్న మరమ్మతు కోసం పెద్ద రోడ్డును తవ్వి.. ప్రజలకు పెద్ద తిప్పలు తెచ్చిపెట్టడం ఎంతవరకు సమంజసం? అని డాక్టర్స్ కాలనీ, జేబీ కాలనీ చుట్టు పక్కల నివాసులు ప్రశ్నిస్తున్నారు.



