- తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా బతుకమ్మ సంబురాలు
- ఎంగిలిపూల నుంచి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజుల వైభవం..
హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలోని సకల జనులకు, ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మ వరకు సాగే ఈ తొమ్మిది రోజుల పాటు రాష్ట్రంలోని ఆడబిడ్డలందరూ భక్తిశ్రద్ధలతో, ఆటపాటలతో అత్యంత వైభవంగా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.

*ప్రకృతి ఆరాధన – తెలంగాణ ప్రత్యేకత
ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సాక్షాత్తు గౌరమ్మను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించడం ఒక్క తెలంగాణ సంస్కృతికే సొంతమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల సామూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను సమానంగా పంచుకునే ఐక్యతా భావానికి బతుకమ్మ పండుగ నిలువెత్తు నిదర్శనమని అభివర్ణించారు.
ప్రజల సాంస్కృతిక వైభవాన్ని, మహిళల సంఘటిత శక్తిని నలుదిశలా చాటిచెప్పే ఈ మహోత్సవంలో ఎన్నెన్నో సామాజిక అంశాలు ఇమిడి ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవానికి, తరతరాలుగా వస్తున్న సనాతన సంప్రదాయాలకు బతుకమ్మ సముచిత ప్రతీకగా నిలుస్తోందని వెల్లడించారు.
ప్రకృతిని ఆరాధించే తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా, నేడు పర్యావరణ పరిరక్షణకు ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ బతుకమ్మ సంబురాలు ప్రతి ఇంటా సిరులు కురిపించాలని, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వేడుకలను జరుపుకోవాలని మనసారా ఆకాంక్షించారు.



