Friday, October 30, 2026
Google search engine
Homeతెలంగాణప్రజలకు పోలీసు సేవలను చేరవేయడమే ‘సురక్ష’ లక్ష్యం

ప్రజలకు పోలీసు సేవలను చేరవేయడమే ‘సురక్ష’ లక్ష్యం

  • సాంకేతికతతో మారుతున్న సమాచార వ్యవస్థ
  • పోలీసు వ్యవస్థలోని త్యాగాలు, సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: డిజిపి సి.వి. ఆనంద్
  • స్థానిక భాషపై పట్టు ఉంటేనే ప్రజలతో మెరుగైన అనుసంధానం
  • ప్రాంతీయ యాసలు, భాషా వైవిధ్యమే ప్రత్యేకత
  • ‘సురక్ష’ దిన పత్రిక ప్రథమ వార్షికోత్సవంలో డిజిపి సి.వి. ఆనంద్

హైదరాబాద్‌

మారుతున్న సమాచార వ్యవస్థలో పోలీసుల సేవలు, త్యాగాలు, ప్రజలకు అందిస్తున్న సేవా కార్యక్రమాలను సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలంగాణ డిజిపి, ‘సురక్ష’ దినపత్రిక ప్రధాన సంపాదకుడు సి.వి. ఆనంద్ పేర్కొన్నారు. పోలీసులపై తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చినప్పుడు వాస్తవాలను ప్రజలకు వివరించడంతోపాటు, ప్రజా సమస్యలు, పోలీసు సేవలు, నేరాలపై అవగాహన కల్పించడంలో ‘సురక్ష’ కీలక పాత్ర పోషించాలని సూచించారు.

తెలంగాణ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సురక్ష’ దినపత్రిక ప్రథమ వార్షికోత్సవ సమావేశం గురువారం హైదరాబాద్‌లోని పేట్లబురుజులో ఉన్న సిటీ పోలీస్‌ కాలేజీలో జరిగింది. ఈ కార్యక్రమానికి డీజీపీ సి.వి. ఆనంద్‌ ప్రధాన సంపాదకుడి హోదాలో హాజరయ్యారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌, ‘సురక్ష’ కార్యనిర్వాహక సంపాదకుడు రమేష్‌ ఆయనకు స్వాగతం పలికారు. ప్రముఖ పాత్రికేయుడు పమిడికాల్వ మధుసూదన్‌, మామిడి హరికృష్ణ, బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలు, పోలీసు యూనిట్లకు చెందిన పీఆర్వోలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సాంకేతికతతో మారుతున్న సమాచార వ్యవస్థ

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. సమాచార ప్రసార విధానంలో కాలానుగుణంగా అనేక మార్పులు చోటుచేసుకున్నాయని వివరించారు. గతంలో ఉర్దూ, ఆంగ్లం, తెలుగు పత్రికల ద్వారా ప్రజలకు వార్తలు చేరేవని, అనంతరం టీవీల ద్వారా పరిమిత సమయంలో వార్తలు ప్రసారమయ్యేవని గుర్తుచేశారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో ప్రత్యక్ష ప్రసారాలు, సామాజిక మాధ్యమాలు విస్తృతమయ్యాయని చెప్పారు.

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ఫోన్‌ ఉండటంతో సమాచారం క్షణాల్లో ప్రజలకు చేరుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను తక్షణమే తెలుసుకునే అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు. అయితే, సమాచారం వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో అందులోని నిజానిజాలను నిర్ధారించడం సవాలుగా మారుతోందని చెప్పారు. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత కారణాలతో పోలీసులపై తప్పుడు కథనాలు ప్రచురించడం, వాస్తవాలను వక్రీకరించడం జరుగుతోందన్నారు.

పోలీసుల సేవలు ప్రజలకు చేరాలి

పోలీసులు విధి నిర్వహణలో ఎదుర్కొనే సవాళ్లు, సమాజం కోసం చేసే త్యాగాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని డిజిపి స్పష్టం చేశారు. పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల సందర్భంగా నిర్వహించే రక్తదాన శిబిరాలు, ఇతర సేవా కార్యక్రమాలు పోలీసుల సామాజిక బాధ్యతకు నిదర్శనమని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

పోలీసు వ్యవస్థలో చోటుచేసుకుంటున్న మార్పులు, పెట్రోలింగ్‌ విధానాలు, కిడ్నాప్‌ కేసులు, వివిధ నేరాలకు సంబంధించిన వివరాలు, ప్రజల భద్రత కోసం చేపడుతున్న చర్యలను సురక్ష లో ప్రచురించాలని అన్నారు. కేసుల దర్యాప్తులో ఎదురయ్యే సవాళ్లు, తప్పిదాల నివారణ, సిబ్బంది మంచి పనులు, వివిధ నేరాల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించే కథనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంతోపాటు, ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా ప్రత్యేక కథనాలు, వ్యాసాలు రూపొందించాలని తెలిపారు.

స్థానిక భాషపై పట్టు అవసరం

ప్రజలతో మాట్లాడేటప్పుడు స్థానిక భాషపై అవగాహన, పట్టు అధికారులకు ఎంతో అవసరమని డిజిపి అన్నారు. తెలుగు భాష ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. బ్రిటిష్‌ పాలనలో స్థానిక భాషల అధ్యయనానికి ప్రాధాన్యం ఇచ్చిన విధానాలను ప్రస్తావించారు. స్థానిక భాష తెలిసినప్పుడే ఆయా ప్రాంతాల్లోని ప్రజల సమస్యలు, వారి ఆలోచనా విధానం, సామాజిక పరిస్థితులను అధికారులు అర్థం చేసుకోగలుగుతారని చెప్పారు.

తెలుగు భాషకు విశేష సేవలందించిన సి.పి. బ్రౌన్‌ కడప ప్రాంతంలో పనిచేసిన సమయంలో తెలుగు సాహిత్య గ్రంథాల సేకరణ, ప్రచురణకు కృషి చేశారని గుర్తుచేశారు. ఇక్కడి విషయాలు, విశేషాలను ఇంగ్లీష్, జర్మన్ వంటి ఇతర భాషల్లోకి అనువదించడం ద్వారా భాషా సంపదను విస్తృతంగా పరిచయం చేసే అవకాశం కలిగిందన్నారు.

తాను హైదరాబాద్‌లో జన్మించినందున ఇక్కడి ప్రాంతీయ భాషలు, యాసలు, సంస్కృతిపై తనకు ప్రత్యేక అవగాహన ఉందని డీజీపీ పేర్కొన్నారు. హైదరాబాద్‌ నగరంలోని ప్రాంతాలవారీగా భాషలో కనిపించే వైవిధ్యం, యాసలోని ప్రత్యేకత భాషకు మరింత అందాన్ని తెస్తాయని చెప్పారు. పోలీసు అధికారులు ప్రజలతో నేరుగా మాట్లాడే సమయంలో స్థానిక భాషపై పట్టు సాధిస్తే వారి సమస్యలను సులభంగా అర్థం చేసుకుని, మెరుగైన సేవలు అందించగలరని స్పష్టం చేశారు.

ప్రజలకు పోలీసు సేవలపై అవగాహన కల్పించాలి

పోలీసు శాఖలో చేపడుతున్న సంస్కరణలు, ప్రజలకు అందుబాటులో ఉన్న సేవలు, నేరాల నివారణకు తీసుకుంటున్న చర్యలను నిరంతరం ప్రజలకు తెలియజేయడమే ‘సురక్ష’ ప్రధాన లక్ష్యంగా ఉండాలని డీజీపీ సూచించారు. వార్తల ప్రచురణలో వాస్తవికత, స్పష్టత, ప్రజోపయోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. పోలీసు శాఖకు, ప్రజలకు మధ్య సమాచార వారధిగా ‘సురక్ష’ నిలవాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments