సాహితినగర్ కాలనీ అభివృద్ధికి ప్రత్యేక చొరవ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..
ఎల్బీనగర్:
సాహితినగర్ కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాహితినగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన సమావేశానికి బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ ప్రాంతంలో నెలకొన్న ప్రధాన సమస్యలను వివరించి, వాటి పరిష్కారానికి సహకరించాలని కోరారు.
కాలనీలో సుమారు 20 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన డ్రైనేజీ పైప్‌లైన్ ప్రస్తుత అవసరాలకు సరిపోకపోవడంతో తరచూ బ్లాక్ అవుతూ మురుగునీటి సమస్య తలెత్తుతోందని, దీనివల్ల నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అదేవిధంగా కమ్యూనిటీ హాల్‌కు అదనపు అంతస్తు నిర్మాణం కోసం నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు.దీనిపై వెంటనే స్పందించిన బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి జలమండలి అధికారులతో మాట్లాడి డ్రైనేజీ పైప్‌లైన్ సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి, కాలనీవాసులకు ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు.అలాగే కమ్యూనిటీ హాల్ అదనపు అంతస్తు నిర్మాణానికి సంబంధించి ఇంజనీరింగ్ విభాగ అధికారులతో మాట్లాడి పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. వీలైనంత త్వరగా పనులు ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు అనిల్, శ్రీనివాస్, బీ.ఎన్ రావు, బీజేపీ డివిజన్ అధ్యక్షులు దాసరి జయప్రకాష్, నాయకులు టీంకు, పవన్ తదితరులు పాల్గొన్నారు.


