- డాక్టర్ మధు విజయ్ తనయుడి జన్మదిన వేడుకల్లో సేవానిరతి..
- సుమారు 300 మందికి ఉచిత భోజన వితరణ
*హైదరాబాద్:
నగరంలోని బంజారాహిల్స్ ప్రసిద్ధ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ప్రాంగణం వేదికగా మానవతా దృక్పథం పరిమళించింది. ‘రెడీ టూ సర్వ్’ ఫౌండేషన్ మరియు ‘అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్’ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం అత్యంత స్పూర్తిదాయకంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
క్యాన్సర్ మహమ్మారితో పోరాడేందుకు సుదూర ప్రాంతాల నుండి వచ్చి, ఆస్పత్రి పరిసరాల్లో నిరీక్షిస్తున్న నిరుపేద రోగులు, వారి సహాయకులు, బంధువుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఈ బృహత్ కార్యక్రమం చేపట్టారు.
జన్మదిన వేడుకల్లో సేవా దృక్పథం
ప్రముఖ వైద్యులు డాక్టర్ మధు విజయ్ కుమారుడు వసుమనాస్ కార్తికేయ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కేకులు, ఆర్భాటాలకు దూరంగా, ఇతరుల ఆకలి తీర్చడమే నిజమైన వేడుక అని చాటుతూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మందికి రుచికరమైన భోజనాన్ని వడ్డించారు. ఫౌండేషన్ వాలంటీర్లు స్వయంగా దగ్గరుండి భోజనాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ నిర్వాహకులు పెద్ది శంకర్ మాట్లాడుతూ.. సమాజంలో పూట గడవని నిరుపేదలకు, ఆకలితో అలమటించేవారికి అండగా నిలవడమే తమ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ఆస్పత్రుల వద్ద పడిగాపులు కాసే రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. సమాజ సేవలో భాగస్వాములు కావాలనుకునే దాతలు, స్వచ్ఛంద సేవకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
చికిత్స కోసం వచ్చిన తమకు ఆకలి తీర్చిన నిర్వాహకుల సేవలు మరువలేనివని లబ్ధిదారులు భావోద్వేగంతో తెలిపారు. కష్టకాలంలో ఆపద్బాంధవులలా ఆదుకున్న ఫౌండేషన్ సభ్యుల సేవలను పలువురు ప్రత్యేకంగా అభినందించారు.


