ప్రజా ఇబ్బందులను గుర్తించి సొంత నిధులతో నిర్మించిన – బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..
ఎల్బీనగర్
గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ బస్ స్టాప్ వద్ద గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ లేకపోవడంతో ఆటో డ్రైవర్లు, స్థానిక వ్యాపారులు, కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టాయిలెట్స్ నుంచి వెలువడుతున్న దుర్వాసనతో పాటు రాత్రివేళ ప్రయాణికులకు ఎదురవుతున్న అసౌకర్యాన్ని గుర్తించిన గడ్డిఅన్నారం డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్, బీజేపీ నాయకులు బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి తన సొంత నిధులతో నూతన పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని గడ్డిఅన్నారం బీఎంఎస్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ పబ్లిక్ టాయిలెట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి (అర్బన్) జిల్లా బీజేపీ అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి,ఎల్బీనగర్ బీజేపీ ఇన్చార్జ్ సామ రంగారెడ్డి, స్థానిక తాజా మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పాల్గొని నూతన టాయిలెట్స్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, వివేకానంద నగర్ బస్ స్టాప్ వద్ద ఉన్న పాత పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ లేకపోవడంతో స్థానికులు, కాలనీవాసులు, ఆటో డ్రైవర్లు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యకు పరిష్కారం లభించలేదని తెలిపారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని,అందరి సహకారంతో తన సొంత నిధులతో నూతన పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు.ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పరిసరాల పరిశుభ్రతను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ నిర్మాణ పనుల ప్రారంభం నుంచి నేటి ప్రారంభోత్సవం వరకు నిరంతరం కృషి చేసిన షేక్ ఉమర్, రూప్ లాల్, కేశవ్ నాయక్ తదితరులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా స్థానిక ఆటో డ్రైవర్లు, కాలనీవాసులు తమ సమస్యను గుర్తించి సొంత నిధులతో నూతన పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చిన బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దిల్సుఖ్నగర్ భాగ్ సంఘచాలక్ మేకల లోకిణతం, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చిలుకూరి రామిరెడ్డి, వివేకానంద నగర్ కాలనీ అధ్యక్షులు ఎద్దు మోహన్, శ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సభ్యులు రాజేందర్, బీఎంఎస్ సీనియర్ నాయకులు రవిశంకర్, గడ్డిఅన్నారం డివిజన్ బీజేపీ అధ్యక్షులు దాసరి జయప్రకాష్, డివిజన్ సీనియర్ నాయకులు ఉపేందర్ గుప్తా, రూప్ లాల్, షేక్ ఉమర్, సుజాత, సిరి రెడ్డి, సతీష్, వివేక్, సందీప్, రాజేశ్వరి, సుబ్బారెడ్డి, కేశవ్, రఘు జోషి, శశాంక్, గిరీష్ తదితరులు పాల్గొన్నారు.


