Monday, August 10, 2026
Google search engine
Homeతెలంగాణభువికి దిగివచ్చిన శాంతికి… ఖాకీల ప్రాణత్యాగాలే శాశ్వత పునాది!

భువికి దిగివచ్చిన శాంతికి… ఖాకీల ప్రాణత్యాగాలే శాశ్వత పునాది!

  • వరంగల్ గడ్డపై అమరుల కుటుంబాలతో డీజీపీ సి.వి. ఆనంద్ ఆత్మీయ భేటీ
– అమరుల సంక్షేమమే ధ్యేయంగా విప్లవాత్మక ‘టీజీ-వీర్’ పోర్టల్ ఆవిష్కరణ

వరంగల్, ఆగస్టు 9: భారత శక్తి,
ఉమ్మడి వరంగల్ నేల రక్తసిక్తమైన చరిత్ర నుంచి నేడు ప్రశాంత వాతావరణం వైపు అడుగులు వేస్తోందంటే, దానికి మావోయిస్టు హింసాకాండలో అసువులు బాసిన పోలీసు అమరుల త్యాగనిరతే ఏకైక శాశ్వత పునాది అని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సి.వి. ఆనంద్ గర్వంగా ఉద్ఘాటించారు. చరిత్ర పుటల్లో చెరగని ముద్ర వేసిన ఆ త్యాగధనుల రక్తతర్పణం వల్లే నేడు రాష్ట్రంలో ప్రగతి ఫలాలు పండుతున్నాయని స్పష్టం చేశారు.
తెలంగాణ పోలీసుశాఖ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రీతిలో, వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన 28 మంది అమరవీరుల కుటుంబ సభ్యులతో డీజీపీ రెండో రోజు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాకీల కుటుంబాల సంక్షేమాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తరఫున సరికొత్త భరోసాను కల్పిస్తూ సమగ్రమైన ‘టీజీ-వీర్’ (TG-VEER) గ్రీవెన్స్ పోర్టల్‌ను ఆయన అధికారికంగా ప్రారంభించారు.

*ఒకటే వేదిక… అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం!
దశాబ్దాలుగా అమరుల కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలకు చరమగీతం పాడుతూ ‘టీజీ-వీర్’ పోర్టల్‌ను అత్యంత పకడ్బందీగా రూపొందించారు.

  • ఏకైక వేదిక: ఎక్స్‌గ్రేషియా, ఆర్థిక సహాయం, కారుణ్య నియామకాలు, ఇళ్ల స్థలాల కేటాయింపు, ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించిన ఏ చిన్న ఫిర్యాదునైనా ఇకపై ఈ డిజిటల్ వేదిక ద్వారా నేరుగా నమోదు చేసుకోవచ్చు.
  • సంపూర్ణ డేటాబేస్: అమరుల సేవా రికార్డులు, కుటుంబ సమగ్ర వివరాలు, ఇప్పటివరకు అందిన ప్రయోజనాలు, ప్రభుత్వ జీవోలన్నీ ఇందులో నిక్షిప్తమై ఉంటాయి.
  • పారదర్శక పర్యవేక్షణ: క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు ఫిర్యాదుల పరిష్కార తీరును ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పర్యవేక్షించేలా సాంకేతికతను జోడించారు.

అంతేకాకుండా, అత్యాధునిక క్యూఆర్ కోడ్ (QR Code) తో కూడిన ప్రత్యేక ఫ్యామిలీ కార్డులను డీజీపీ స్వయంగా అమరవీరుల కుటుంబాలకు అందజేశారు. ఈ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా నేరుగా ‘టీజీ-వీర్’ పోర్టల్‌లోకి ప్రవేశించి తమ సమస్యలను సులభంగా పరిష్కరించుకునే వెసులుబాటు కల్పించారు. ఈ విప్లవాత్మక పోర్టల్‌ను రూపొందించిన ఎస్‌ఐబీ (SIB) అధికారులను ఆయన ఘనంగా అభినందించారు. రాష్ట్రంలోని ప్రతి యూనిట్ నుంచి అమరుల కుటుంబాల సమస్యలను సత్వరమే సేకరించి సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించారు.

*దశాబ్దాల పెండింగ్ సమస్యలపై డీజీపీ భరోసా:
ఈ ఆత్మీయ సమ్మేళనంలో అమరుల కుటుంబాలు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఎక్స్‌గ్రేషియా, రిజిస్ట్రేషన్లు, పెన్షన్లు, స్థలాల కేటాయింపు తదితర సమస్యలను డీజీపీ ముందు ఏకరువు పెట్టాయి. స్పందించిన డీజీపీ… ఆ మహావీరుల కుటుంబాల కష్టాలను స్వయంగా ఆలకించి, వాటిని ప్రభుత్వ ఉన్నతస్థాయి దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం చూపుతామని ఘంటాపథంగా హామీ ఇచ్చారు. ఈ పెండింగ్ అంశాల పరిష్కార ప్రక్రియను వరంగల్ పోలీసు కమిషనర్ స్వయంగా వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.

*చరిత్రను మరవని ఖాకీ…
తన వృత్తి జీవితాన్ని తొలిసారిగా వరంగల్ గడ్డపైనే ప్రారంభించిన సువర్ణ సత్యాలను డీజిపి ఈ సందర్భంగా భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. నక్సలైట్ల తూటాలకు వణికిపోయిన అత్యంత సంక్షిష్టమైన కాలంలో, ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తించిన సిబ్బంది త్యాగాలను ఆయన కొనియాడారు. అనాటి ఆ ధైర్యసాహసాల ఫలితమే నేడు ఈ ప్రాంత ప్రజలు ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతున్నారని పునరుద్ఘాటించారు.

*ఆధునిక హంగులతో కమిషనరేట్ నిర్మాణం
ఈ పర్యటనలో భాగంగా నిర్మాణ దశలో ఉన్న వరంగల్ పోలీసు కమిషనరేట్ నూతన కార్యాలయ భవన నిర్మాణ తీరుతెన్నులను డీజీపీ క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలకు మరింత చేరువగా, అత్యంత వేగంగా సేవలు అందేలా అత్యాధునిక సాంకేతికత, పటిష్టమైన నిఘా వ్యవస్థలతో భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న పాత నిర్మాణాలను తక్షణమే తొలగించి, కార్యాలయానికి రాకపోకలు సాగించే అంతర్గత రహదారులను విశాలంగా, సుందరంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments