- అయోధ్యలోని పవిత్ర శ్రీరామ జన్మభూమి మందిరాన్ని
ప్రసిద్ధ శ్రీ హనుమాన్‌గఢీ ఆలయాన్ని సందర్శించిన గవర్నర్
హైదరాబాద్
ధర్మం, సత్యం, న్యాయం, కర్తవ్యనిష్ఠలకు ప్రతిరూపమైన భగవాన్ శ్రీరాముడి జీవితం యావత్ మానవాళికి ఆదర్శమని తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. శ్రీరాముడు ఆచరించి చూపిన విలువలు సమాజానికి శాశ్వత మార్గదర్శకాలని, ఆయన ఆదర్శాలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో అనుసరించాలని ఆకాంక్షించారు.
మంగళవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అయోధ్యలోని పవిత్ర శ్రీరామ జన్మభూమి మందిరాన్ని సందర్శించారు.
బాలరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ప్రసిద్ధ శ్రీ హనుమాన్‌గఢీ మందిరాన్ని సందర్శించి ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా శ్రీరాముడి జీవిత విశిష్టతను ప్రస్తావిస్తూ.. తల్లిదండ్రుల పట్ల గౌరవం, సోదరుల పట్ల ప్రేమ, ప్రజల పట్ల బాధ్యత, ధర్మ పరిరక్షణ, సత్యనిష్ఠ, త్యాగనిరతి వంటి ఉన్నత విలువలకు శ్రీరాముడి జీవితం నిదర్శనమని పేర్కొన్నారు. రామరాజ్యం ఆదర్శ పాలనకు నేటికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు.
శ్రీరాముడి ఆదర్శాలను ప్రతి ఒక్కరూ ఆచరించడం ద్వారా సమాజంలో శాంతి, సామరస్యం, ఐక్యత మరింత బలోపేతమవుతాయని గవర్నర్ ఆకాంక్షించారు.



