- ప్రాణ స్నేహితుడినే దారుణంగా హతమార్చిన రౌడీషీటర్
- పాత కక్షలు, సెటిల్మెంట్ డబ్బుల వివాదమే హత్యకు కారణం
- నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు
ఎల్బీనగర్:
హైదరాబాద్ నగరంలో మరో దారుణ హత్య కలకలం రేపింది. చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న ప్రాణ స్నేహితులే రౌడీషీటర్లుగా మారి చివరకు ఒకరి హత్యకు మరొకరు కారణమయ్యారు. నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్ చౌరస్తా సుప్రీమ్ వైన్స్ లోన వందల మంది చూస్తుండగా, ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన రౌడీషీటర్ మహమ్మద్ నహీమ్ దారుణ హత్యకు గురయ్యాడు.ఇల్లెందు పట్టణానికి చెందిన రౌడీషీటర్లు ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్, మహమ్మద్ నహీమ్ చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నారు. ఇద్దరూ ఆప్తమిత్రులుగా ఉన్నప్పటికీ, కొంత కాలంగా వారి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. బండ్లగూడ సహ భావన అపార్ట్మెంట్లో నివాసముంటున్న నహీమ్‌ను పాత కక్షల నేపథ్యంలో మహేష్ అతని స్నేహితులు 6 మంది కలిసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.గతంలో
సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన డబ్బుల విషయంలోనే గత మూడు నెలలుగా ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఈ వివాదం క్రమంగా ముఠా కక్షలకు దారి తీసి చివరకు హత్యకు కారణమైనట్లు తెలుస్తోంది.ఇప్పటికే మహేష్, నహీమ్లపై పలు హత్య కేసులు ఉన్నట్లు సమాచారం. ఇల్లెందు పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరి పైనా రౌడీషీట్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హత్య ఘటనపై నాగోల్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.హత్యకు పాల్పడిన మహేష్ అండ్ టీం కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఘటనలో మరెవరైనా పాల్గొన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


