ఎల్బీనగర్:
‘సరూర్‌నగర్ మండలం కర్మన్‌ఘాట్, నందిహిల్స్‌లోని పలు సర్వే నంబర్లపై హైకోర్టు స్టే ఇచ్చింది. గతంలో ఇచ్చిన ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్ (ఓఆర్సీలను రద్దు చేసింది). ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి… తుది నివేదికను అందజేయాలని సూచించింది. ఆ మేరకు చర్యలు చేపడుతామని సరూర్‌నగర్ తహశీల్దార్ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. . ఈ అంశంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఆంక్షలు
1970 దశకం నాటి ల్యాండ్ రీఫార్మ్ ట్రెబ్యునల్ రికార్డులు ఇప్పుడు సంచలనంగా మారాయి. కర్మన్‌ఘాట్ గ్రామంలోని (సీసీ నంబర్ ఈ/2476,2477,2478,/1975) పలు సర్వే నంబర్ల భూములపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇనాందారు వారసులకు, ఇతర ప్రైవేటు భాగస్వాములకు నోటీసులు ఇచ్చి, ఆరు నెలల వ్యవధిలో విచారణ ముగించాలని ఆదేశించింది. అప్పటి వరకు ఈ సర్వే నంబర్లలోని భూములకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని పేర్కొంది.దీంతో రిజిస్ట్రేషన్లు, ఇంటి నిర్మాణానికి అనుమతులు నిలిపి వేస్తున్నట్లు అధికారులు చెప్పడంతో స్థానికుల్లో అలజడి మొదలైంది.
అసలు ఈ కేసు ఏమిటీ..?
మరణించిన వ్యక్తులు, వారి చట్టబద్దమైన వారసులను పార్టీగా చేర్చకుండా ఇనాం భూములకు ఓఆర్సీలు జారీ చేశారనే అభియోగంపై దాఖలైన రిట్ పిటిషన్(డబ్ల్యూపీ నంబర్ 11087/ 2004)పై హైకోర్టు ఇటీవల కీలక తీర్పును వెల్లడించింది. 2004 మార్చి 3న అప్పటి జిల్లా జాయింట్ కలెక్టర్ జారీ చేసిన కామన్ ఆర్డర్‌ను రద్దు చేసింది. 1/11/1973లో ఈ ఇనాం భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయో నిర్ధారించకుండా, ఓఆర్సీలు మంజూరు చేశారని, వీటిని రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ఈ అంశంపై విచారణ జరిపి నివేదికను అందజేయాలని ఆర్డీఓను ఆదేశించింది. ఆ మేరకు రెవెన్యూ యంత్రాంగం విచారణకు సిద్ధమైంది. ఆరు మాసాల్లో నివేదికను అందజేయనుంది.


