ఎల్ బీ నగర్:
సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, జిల్లా పరిషత్ పాఠశాల, కర్మాన్ ఘాట్ ప్రభుత్వ పాఠశాలలలోని పరీక్షా కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన నీట్ (NEET-UG 2026) రీ-పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.మూడు పరీక్ష కేంద్రాలలో 912 మంది విద్యార్థులు హాజరైనారు.పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అభ్యర్థుల గుర్తింపు ధృవీకరణ అనంతరం మాత్రమే కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏసీపీ కృష్ణయ్య, సీఐ శ్రీశైలం, పోలీసు సిబ్బంది ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా నీట్ పరీక్షల కోసం ప్రత్యేక భద్రతా చర్యలు అమలు చేసినట్లు అధికారులు తెలిపారు. నీట్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు నిర్వహించగా, అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకుని హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకున్నారు. దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరైనట్లు సమాచారం.


