‘సురక్షా కా తిరంగా’తో రాష్ట్రవ్యాప్తంగా సైబర్ స్వతంత్ర ఉద్యమం ప్రారంభం
హైదరాబాద్:
జాతీయ పతాకంలోని త్రివర్ణ స్ఫూర్తిని ఆయుధంగా మలుచుకుని, డిజిటల్ నేరగాళ్లపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ముసుగులో అమాయకుల కష్టార్జితాన్ని కొల్లగొడుతున్న సైబర్ మూకల ఆట కట్టించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) నడుంబిగించింది. ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నెల రోజుల ‘సురక్షా కా తిరంగా – సైబర్ స్వతంత్రదిశగా తెలంగాణ’ ప్రచార కార్యక్రమానికి హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) వేదికగా అంకురార్పణ జరిగింది.
రాష్ట్ర పోలీస్ శాఖ అత్యున్నత శిఖరాగ్రాన్నుంచి జాతీయ పతాక స్పూర్తితో ఈ మహా యజ్ఞం ప్రారంభమైంది. తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ & హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ శ్రీ సి.వి. ఆనంద్, ఐపీఎస్ చేతుల మీదుగా ఈ ప్రచార రథం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శ్రీమతి శిఖా గోయల్, ఐపీఎస్ తో పాటు పలువురు పోలీసు అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
*జాతీయ పతాక త్రివర్ణ సందేశం – సైబర్ రక్షణకు మూడు కవచాలు:
భారతీయ పతాకంలోని ప్రతి రంగు వెనుక ఉన్న పవిత్రతను సైబర్ భద్రతకు అన్వయిస్తూ పోలీసులు సరికొత్త నినాదాలను రూపొందించారు:
- కాషాయం (త్యాగం, అప్రమత్తత): అనుమానాస్పద లింకులు, నకిలీ కాల్స్ పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. (Be Alert)
- తెలుపు (శాంతి, జ్ఞానం): సైబర్ మోసాల తీరుతెన్నులపై పరిజ్ఞానాన్ని, అవగాహనను పెంపొందించుకోవాలి.
- ఆకుపచ్చ (సమృద్ధి, భద్రత): తగు జాగ్రత్తలు పాటిస్తూ ఆర్థికంగా, డిజిటల్ పరంగా సురక్షితంగా ఉండాలి.
*డిజిటల్ అరెస్టులు, ట్రేడింగ్ మోసాలపై ప్రత్యేక నిఘా
నేడు సమాజాన్ని కుదిపేస్తున్న అత్యంత ప్రమాదకరమైన ఆర్థిక నేరాలపై ఈ ప్రచారంలో ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. పెరుగుతున్న స్టాక్ ట్రేడింగ్ మోసాలు, నకిలీ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్లు, మరియు అమాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ‘డిజిటల్ అరెస్ట్’ రకం నేరాల మూలాలను ఛేదించడమే లక్ష్యంగా ఈ వ్యూహం రూపుదిద్దుకుంది.
*వారాల వారీగా వ్యూహాత్మక ప్రణాళిక
సమాజంలోని అన్ని వర్గాలను చైతన్యం చేసేందుకు నిర్దిష్టమైన ప్రణాళికను అమలు చేస్తున్నారు:
- మొదటి వారం: విద్యార్థులు మరియు యువతను భాగస్వామ్యం చేయడం.
- రెండో వారం: ఉద్యోగులు మరియు వృత్తి నిపుణులకు ప్రత్యేక అవగాహన.
- మూడో వారం: సైబర్ నేరగాళ్ల ప్రధాన లక్ష్యంగా మారుతున్న సీనియర్ సిటిజన్లు మరియు కమ్యూనిటీ సంస్థలపై దృష్టి.
- చివరి వారం: రాష్ట్రవ్యాప్తంగా మూలమూలకూ విస్తృత ప్రజా అవగాహన కార్యక్రమాల నిర్వహణ.
*మోసం జరిగితే క్షణం ఆలస్యం చేయకండి!
సైబర్ మాయగాళ్ల వలలో చిక్కుకున్న బాధితులు ఏమాత్రం సంకోచించకుండా తక్షణమే రంగంలోకి దిగాలని పోలీసులు పిలుపునిచ్చారు.
- అత్యవసర హెల్ప్‌లైన్: వెంటనే 1930 నెంబర్‌కు కాల్ చేయండి.
- ఆన్లైన్ ఫిర్యాదు: నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు నమోదు చేయండి.


