Friday, July 31, 2026
Google search engine
Homeతెలంగాణహైదరాబాద్‌పై హరిత ముద్ర: కూరగాయల సాగుకు సర్కార్‌ ప్రణాళిక

హైదరాబాద్‌పై హరిత ముద్ర: కూరగాయల సాగుకు సర్కార్‌ ప్రణాళిక

  • *సెంట్రలైజ్డ్‌ కిచెన్ల చుట్టూ ఆర్గానిక్‌ పంటల సాగుకు సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం
  • *ఎల్ నినో ప్రభావంపై నిపుణుల కమిటీ నివేదిక సమర్పణ.. ప్రత్యామ్నాయ సేద్యానికే పెద్దపీట

హైదరాబాద్:

రాష్ట్రంలో కూరగాయల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని, సేంద్రీయ (ఆర్గానిక్‌) పద్ధతుల వైపు రైతులను మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకం కోసం కొత్తగా నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్‌ కిచెన్ల పరిసర ప్రాంతాల్లో కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించింది. గురువారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎల్ నినో పరిస్థితుల ప్రభావంపై నిపుణుల కమిటీ తన నివేదికను సమర్పించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రైతులకు సబ్సిడీపై నాణ్యమైన విత్తనాలు అందించడంతో పాటు, వారు పండించిన పంటలను నేరుగా కొనుగోలు చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ నుంచి విస్తరణ అధికారులను నియమించి రైతులకు సాంకేతిక అవగాహన కల్పించాలన్నారు.

*ఎల్ నినో ప్రభావం – ప్రత్యామ్నాయ ప్రణాళిక
రాష్ట్రంలో తగినంత వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడిందని నిపుణుల కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. గత ఏడాది ఇదే సీజన్‌లో 79.49 లక్షల ఎకరాల్లో సాగు జరుగగా, ఈ ఏడాది అది 74.56 లక్షల ఎకరాలకు పడిపోయినట్లు వెల్లడించింది. ఇందులో ప్రధానంగా పత్తి 45 లక్షల ఎకరాలు, సోయాబీన్‌ 3.62 లక్షల ఎకరాలు, వరి 14.92 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగవుతున్నట్లు పేర్కొంది. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు సంప్రదాయ పంటల నుంచి ప్రత్యామ్నాయ సేద్యం వైపు మళ్లాలని సూచించింది.

*కమిటీ సిఫారసులు – ముఖ్యాంశాలు:
సబ్సిడీ విత్తనాలు: పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాలు, కూరగాయల పంటల సాగును ప్రోత్సహించడానికి 75 శాతం సబ్సిడీతో విత్తనాలు అందజేయాలి. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే రైతన్నలకు కొత్త రుణాలు మంజూరు చేయాలి.
*తుంపర, బిందు సేద్యం: ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు 75 నుంచి 90 శాతం సబ్సిడీతో డ్రిప్, స్ప్రింక్లర్ సాగు విధానాలను విస్తృతంగా అమలు చేయాలి.
*పశుగ్రాసం, డైరీ రంగానికి ప్రోత్సాహం: పశుగ్రాస విత్తనాలను సబ్సిడీపై అందించి గడ్డి సాగును పెంచాలి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో డైరీ యూనిట్ల స్థాపనకు ఆర్థిక సహాయం అందించాలి.
*నిరంతర విద్యుత్, రవాణా: సాగునీటి సరఫరా కోసం విద్యుత్‌ కోతలు లేకుండా చూడాలి. హైదరాబాద్ పరిసర గ్రామాల్లో పండించే కూరగాయలను రైతు బజార్లకు తరలించేందుకు ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించాలి.
*గ్రామస్థాయి బృందాలు: అత్యవసర కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయడానికి మరియు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడానికి ప్రత్యేక గ్రామస్థాయి బృందాలను ఏర్పాటు చేయాలి.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డితో పాటు నిపుణుల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments