- ఒకే పాస్‌తో మెట్రో, బస్సు ప్రయాణం.. డిజిటల్ వీక్లీ పాస్‌లు ప్రారంభం.
- ఆటో డ్రైవర్లకు మోక్షం.. ఛార్జీల సవరణకు ప్రభుత్వం జీవో జారీ.
- ప్రజా రవాణా బలోపేతానికి నెలకు రూ.350 కోట్లు విడుదల.
హైదరాబాద్
తెలంగాణ గడ్డపై ప్రజా రవాణా రంగంలో చరిత్రాత్మక అధ్యాయం మొదలైంది. ప్రయాణికుల కష్టాలను పటాపంచలు చేస్తూ, రవాణా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. రాజధాని నగరంలో ప్రయాణాన్ని అత్యంత సులువు, సుమధురం చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం, టీజీఎస్ఆర్టీసీ (టీ.జి.ఎస్.ఆర్ టి.సి), హెచ్ఎంఆర్ఎల్ (HMRL) సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘మెట్రో – ఆర్టీసీ కామన్ పాస్’ విధానాన్ని ఘనంగా ఆవిష్కరించాయి.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రులు వివేక్ వెంకట్ స్వామి, అజారుద్దీన్ ఈ విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రివర్గంలోని 15 మంది మంత్రులకూ కామన్ పాస్‌లను కొనుగోలు చేసి ఆదర్శంగా నిలిచారు. రేపు ఉదయం 10 గంటలకు బేగంపేట నుంచి ఈ కామన్ పాస్ ద్వారా మంత్రులు మెట్రోలో నేరుగా ప్రయాణించనున్నారు.
ఒకే పాస్‌తో బస్సు, మెట్రో ప్రయాణం
నగర ప్రజల రవాణా ఇబ్బందిని శాశ్వతంగా తొలగించేందుకు ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టింది. ఇకపై ప్రయాణికులు వేర్వేరు టికెట్ల గోల లేకుండా, ఒకే కామన్ పాస్‌తో మెట్రో రైళ్లు మరియు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. దీనితో పాటు రూ.600 ధరతో కూడిన ‘డిజిటల్ వీక్లీ బస్ పాస్’ను, ‘మీ టికెట్’ యాప్ ద్వారా ఓపెన్ టికెట్ విధానాన్ని ఉప ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఫస్ట్ మైల్ – లాస్ట్ మైల్ కనెక్టివిటీని సాకారం చేస్తూ, భవిష్యత్‌లో మరిన్ని రవాణా సేవలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురానున్నారు.
ప్రజా రవాణా వ్యవస్థలో కీలక భాగస్వాములైన ఆటో కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దాదాపు 12 ఏళ్లుగా పెరగని ఆటో ఛార్జీలపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం, ఛార్జీలను సవరిస్తూ అధికారికంగా జీవోను విడుదల చేసింది. ప్రజలపై అనవసర భారం పడకుండా, అదే సమయంలో ఆటో డ్రైవర్లకు ఘనంగా న్యాయం జరిగేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసే దిశగా సత్వర చర్యలు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
ఆర్టీసీకి ఆర్థిక భరోసా – ప్రజా రవాణా బలోపేతం
- ఆర్టీసీ సంస్థను నిలబెట్టేందుకు ప్రభుత్వం ప్రతినెలా రూ.300 కోట్లతో పాటు అదనంగా మరో రూ.50 కోట్లు కలిపి మొత్తం రూ.350 కోట్లు విడుదల చేస్తోంది.
- పదవీ విరమణ పొందిన ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.
- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న ‘మహాలక్ష్మి’ పథకం కింద ఆర్టీసీకి ప్రభుత్వం రూ.12 వేల కోట్ల భారీ భారాన్ని మోస్తూ సంస్థను ఆర్థికంగా ఆదుకుంటోంది.
- హైదరాబాద్‌లో మెట్రో ప్రయాణికుల సంఖ్యను ప్రస్తుతమున్న 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడమే లక్ష్యంగా రవాణా శాఖ కార్యాచరణ రూపొందించింది.
నగరంలో ట్రాఫిక్ ముప్పును, కాలుష్యాన్ని పూర్తిగా నివారించి, పర్యావరణ హితమైన సమగ్ర రవాణా వ్యవస్థను అందించడమే ప్రభుత్వ ధ్యేయం. విజన్ – 2047 లక్ష్యాలకు అనుగుణంగా టెక్నాలజీని జోడించి రవాణా రంగాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చడమే ప్రజాపాలన ప్రభుత్వ అసలు సిసలు లక్ష్యం.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ లు పట్నం మహేందర్ రెడ్డి, అద్దంకి దయాకర్, సీఎస్ సంజయ్ జాజు, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, హైదరాబాద్ మెట్రో ప్రభుత్వ సలహాదారు ఎన్.వి.ఎస్. రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



