- రహింపూర్లోని లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన గవర్నర్
హైదరాబాద్:
మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా ఘన నివాళులర్పించారు. హైదరాబాద్ రహింపూర్లోని లాల్ బహదూర్ ప్లే గ్రౌండ్ వద్ద ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. లాల్ బహదూర్ శాస్త్రి జీవితం నిరాడంబరత, నిజాయితీ, క్రమశిక్షణ, దేశభక్తి, నిస్వార్థ సేవకు ప్రతీకగా నిలిచిందన్నారు. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ సాధారణ జీవన విధానాన్ని కొనసాగిస్తూ, ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేసిన శాస్త్రి ఆదర్శాలు నేటికీ ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రజా జీవితంలో నైతిక విలువలకు, నిజాయితీకి శాస్త్రి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని గవర్నర్ అన్నారు. దేశ ప్రయోజనాలను వ్యక్తిగత ప్రయోజనాల కంటే ముందుగా ఉంచిన ఆయన నాయకత్వం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు.
ప్రధానమంత్రిగా దేశం సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో శాస్త్రి అందించిన నాయకత్వాన్ని గవర్నర్ గుర్తుచేశారు. దేశ భద్రతలో సైనికుల పాత్రతో పాటు ఆహార భద్రతలో రైతుల ప్రాధాన్యాన్ని చాటుతూ ఆయన ఇచ్చిన ‘జై జవాన్.. జై కిసాన్’ నినాదం దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపిందన్నారు.
దేశ ఐక్యత, సమగ్రత, శాంతి, దేశభక్తి, కర్తవ్యనిష్ఠ, సేవాభావం వంటి శాస్త్రి ఆదర్శాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.
అభివృద్ధి చెందిన, శాంతియుత, సమగ్ర, మానవీయ భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని గవర్నర్ సూచించారు. లాల్ బహదూర్ శాస్త్రి సేవలు, విలువలు, దేశం పట్ల ఆయన అంకితభావం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అన్నారు.


