Tuesday, August 4, 2026
Google search engine
Homeతెలంగాణ*అక్రెడిటేషన్ కమిటీల్లో టీడబ్ల్యూజేఎఫ్‌కు ప్రాతినిధ్యం కల్పించాలి..

*అక్రెడిటేషన్ కమిటీల్లో టీడబ్ల్యూజేఎఫ్‌కు ప్రాతినిధ్యం కల్పించాలి..

  • *తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
  • *రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు
  • *జర్నలిస్టుల హక్కుల పరిరక్షణలో మరో చారిత్రక మైలురాయి
  • *ఇది ప్రతి జర్నలిస్టు సాధించిన విజయమన్న రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

జర్నలిస్టుల గొంతు నొక్కాలని చూసిన ప్రభుత్వ కుట్రలకు తెలంగాణ హైకోర్టు దిమ్మతిరిగే తీర్పుతో చెక్ పెట్టింది! అర్హతలను తుంగలో తొక్కి, అక్రెడిటేషన్ కమిటీల్లో అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వ తీరును ఉన్నత న్యాయస్థానం ఏకిపారేసింది. కాలయాప్నన డ్రామాలకు తెరదించుతూ, టీడబ్ల్యూజేఎఫ్‌కు వెంటనే సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని హుకుం జారీ చేసింది. పక్షపాత వైఖరితో నిరంకుశంగా వ్యవహరించిన పాలకులకు ఈ చారిత్రక తీర్పు చెంపపెట్టు వంటిది. హక్కుల సాధనలో జర్నలిస్టుల ఐక్యత ముందు ప్రభుత్వాల ఆటలు సాగవని ఈ తీర్పు మరోసారి నిరూపించింది!

*హైదరాబాద్:

రాష్ట్రంలోని ప్రతి జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ (డీఎంఏసీ)లోనూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్)కు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది. మీడియా అక్రెడిటేషన్ కమిటీల కూర్పులో అర్హత కలిగిన అన్ని జర్నలిస్ట్ సంఘాలకు తగిన స్థానం కల్పించాలని న్యాయస్థానం తేల్చిచెప్పింది.
సమస్త అర్హతలున్నప్పటికీ, టీడబ్ల్యూజేఎఫ్‌కు అక్రెడిటేషన్ కమిటీలలో ప్రాతినిధ్యం నిరాకరించడాన్ని ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీలను ఏర్పాటు చేసే క్రమంలో తమ సంఘానికి అన్యాయం జరిగిందంటూ టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ రిట్ పిటిషన్‌పై గత ఆరు నెలలుగా సుదీర్ఘ విచారణ సాగింది. పిటిషనర్ తరఫు న్యాయవాదులు, ప్రభుత్వ తరఫున అడ్వకేట్ జనరల్ కార్యాలయ న్యాయవాదులు తమ వాదనలను కోర్టు ముందుంచారు.
ఇరువర్గాల వాదనలను, ప్రభుత్వ ఉత్తర్వులను, అక్రెడిటేషన్ నిబంధనలను కూలంకషంగా పరిశీలించిన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహినుద్దీన్‌ల ధర్మాసనం సోమవారం ఈ మేరకు తుది తీర్పు వెలువరించింది. రాష్ట్రంలోని సమస్త జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీల్లో టీడబ్ల్యూజేఎఫ్‌కు తక్షణమే తగిన స్థానం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ తీర్పు వెలువడటంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల మీడియా అక్రెడిటేషన్ కమిటీల్లో టీడబ్ల్యూజేఎఫ్‌కు అధికారిక భాగస్వామ్యం దక్కే మార్గం సుగమమైంది. జర్నలిస్ట్ సంఘాల మధ్య పారదర్శకత, సమాన అవకాశాలు, న్యాయబద్ధమైన ప్రాతినిధ్యం లభించడానికి ఈ చారిత్రక తీర్పు ఎంతగానో దోహదపడుతుందని ప్రముఖ న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
హైకోర్టు వెలువరించిన ఈ తీర్పుపై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. జర్నలిస్టుల హక్కులు, ఆత్మగౌరవం, సంఘాల సమాన ప్రాతినిధ్యం కోసం సాగిస్తున్న పోరాటానికి దక్కిన గొప్ప న్యాయపరమైన విజయమని పేర్కొంది. ఈ తీర్పును వెంటనే అమలు పరచాలని, అన్ని జిల్లాల అక్రెడిటేషన్ కమిటీల్లో టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులను నియమించేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.
భవిష్యత్తులో మీడియా అక్రెడిటేషన్ కమిటీల ఏర్పాటు ప్రక్రియలో గుర్తింపు పొందిన ప్రతి జర్నలిస్ట్ సంఘానికి సముచిత ప్రాధాన్యం దక్కేందుకు ఈ తీర్పు ఒక దిక్సూచిగా నిలుస్తుందని పాత్రికేయ వర్గాలు భావిస్తున్నాయి. ధర్మం, న్యాయం తమ పక్షానే నిలిచాయని, ఈ తీర్పు సంఘం సభ్యులందరి ఉమ్మడి విజయమని రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య సంతోషం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments