Home సాహిత్యం ఆయనొక విప్లవ కెరటం..

ఆయనొక విప్లవ కెరటం..

0
ఆయనొక విప్లవ కెరటం..
Sensation in the world of literature Sri Sri.. The great poet of the 19th century. Scientist who painted red flowers with letters..

సాహితీ ప్రపంచంలో సంచలనం శ్రీ శ్రీ..
19వ శతాబ్దం నాదంటూ ఎలుగెత్తి చాటిన మహాకవి..
అక్షరాలతో ఎర్రని పూలు పూయించిన విజ్ఞాని..

శ్రీశ్రీని తలచుకోవాలంటే ప్రత్యేకించి ఓ సమయం, సందర్భం అక్కర్లేదు.. కాలే కడుపు, ఖాళీ జేబు శ్రీశ్రీని ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటాయి. మహా ప్రస్థానంతో మరో ప్రపంచపు మహా ద్వారాన్ని తట్టిలేపిన మహోగ్ర జ్వాల మన శ్రీశ్రీ. తూటాల్లాంటి మాటలతో ఆకలి రాజ్యంపై రక్తాక్షరాలను చిందించారు ఆ మహాకవి..

నేను సైతం ప్రపంచాగ్నపు సమిధనొక్కటి అంటూ అడుగులేసిన శ్రీశ్రీ.. దారిపొడుగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ.. ధరిత్రి నిండా నిండిన మరో ప్రపంచపు కణకణమండే త్రేతాగ్ని కోసం కదం తొక్కుతూ పదం పాడుతూ హృదాంతరాళాన్ని గర్జించాడు. కుక్కపిల్లలోనూ.. అగ్గిపుల్లలోనూ కవిత్వాన్ని చూసిన శ్రీనివాసరావు చివరికి ఆకలేసి కేకలేశాడు. నేనొక దుర్గం.. నాదొక స్వర్గం.. అనర్గళం.. అనితర సాధ్యం నా మార్గం అంటూ 1983 జూన్ 15న అస్తమించారు.

శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. 1910 ఏప్రిల్ 30వ తేదీన వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు విశాఖపట్నంలో శ్రీ శ్రీ జన్మించారు. 1931లో మద్రాసు యూనివర్సిటీ నుంచి బీఏ పూర్తి చేసిన శ్రీ శ్రీ.. 1935లో విశాఖలోని ఏవీఎస్ కాలేజ్‌లో డిమాన్ట్రేటర్‌గా చేరారు. అనంతరం పాత్రికేయ వృత్తిలో అడుగుపెట్టిన ఆయన ఆంధ్రప్రభ, ఆంధ్రవాణి, ఆకాశవాణిలోనూ పనిచేశారు. ఆ తర్వాత సాహితీ లోకంలో తన ప్రస్థానం మొదలుపెట్టిన శ్రీ శ్రీ ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. శ్రీ శ్రీ కవిత్వంలో బాధితులే ప్రధాన పాత్రదారులు. ఆకలితో అలమటించేవాళ్లు, సమస్యలతో సతమతమయ్యేవారి కోసమే శ్రీరంగం శ్రీనివాసరావు తాపత్రాయం అంతా. 1930, 1940 దశకాల మధ్యలో అమెరికాలో ప్రారంభమైన ఆర్థిక మాంద్యం ప్రపంచమంతటా చుట్టేసింది. ఆ ప్రభావం శ్రీ శ్రీపై ఎక్కువగా పడింది. అదే మహా ప్రస్థానం పుస్తకంలో మనకు ప్రస్ఫుటంగా స్ఫురిస్తుంది. మార్క్స్ మార్గంలో నడిచిన శ్రీ శ్రీ మరణించే వరకూ అదే సిద్ధాంతాన్ని నమ్మారు. శ్రీ శ్రీ కవితలు అంత పాపులర్ అవడానిక ప్రధాన కారణం ఆ కవిత్వంలో కనిపించే ప్రాక్టికాలిటేనే. అందుకే శ్రీ శ్రీ అంటుంటాడు.. అందమైన అబద్ధాల్లో కన్నా నిష్టూరమైన నిజాల్లోనే మంచి కవిత్వం దర్శనీయమవుతుందని. అందుకే ఎప్పుడో 85 ఏళ్ల కిందట ఆయన రాసిన ‘మనమంతా బానిసలం.. పీనుగులం.. గానుగలం’ అనే శ్రమ దోపిడీ నేటి సమాజంలోను స్పష్టంగా కనిపస్తుంది. శైశవ గీతితో పసి హృదయాలను పలకరించాలన్న.. అవతలి గట్టున అలసిన ఓ బాటసారికి బాసటగా నిలవాలన్న ఒక్క శ్రీరంగం శ్రీనివాసరావుకే అది సాధ్యం. అందుకే చలం అన్నారు.. ప్రపంచపు బాధ శ్రీ శ్రీ బాధ అని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here