డిఫెన్స్ భూముల రక్షణకు రంగంలోకి ప్రత్యేక బలగాలు… అక్రమ నిర్మాణాలపై విచారణకు కమిషనర్ ఆదేశం
హైదరాబాద్
రక్షణ శాఖకు చెందిన భూములను ఆక్రమించి అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలపై ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ (హైడ్రా) దృష్టి సారించింది. సైనిక స్థలాలను రక్షించాలంటూ డిఫెన్స్ విభాగ ఉన్నతాధికారులు సైతం హైడ్రాను ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని సర్వే సంఖ్య 507 లో ఉన్న రక్షణ శాఖకు చెందిన ఏ-1 విభాగానికి చెందిన స్థలంలో ఆక్రమణలు జరుగుతున్నట్లు సైన్యం గుర్తించింది. ఈ క్రమంలోనే సైనిక బలగాలకు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ జై సింగ్, సహాయ కమిషనర్ ఉమామహేశ్వరరావులతో కలసి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు.
*అనుమతులు లేకుండా నిర్మాణాలు”ఆర్మీ స్థలాన్ని ఆక్రమించి ఎటువంటి అనుమతులు లేకుండా అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. వెంటనే ఈ ఆక్రమణలను నిలిపివేసి, సైనిక భూమికి రక్షణ కల్పించాలి.”
ఆర్మీ అధికారులు
ఆక్రమణలకు గురైన స్థలంలో ఎటువంటి మున్సిపల్ లేదా ప్రభుత్వ అనుమతులు లేకుండా భవన నిర్మాణం శరవేగంగా జరుగుతోందని అధికారుల బృందం కమిషనర్‌కు వివరించింది.
*క్షేత్రస్థాయి విచారణకు ఆదేశం
సైనిక అధికారుల విన్నపంపై హైడ్రా కమిషనర్ తక్షణమే స్పందించారు. ఈ వ్యవహారంపై సమగ్ర పరిశీలన జరపాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు.
*స్థల పరిశీలన:వివాదాస్పద స్థలాన్ని వెంటనే పరిశీలించి ఆక్రమణలను నిర్ధారించుకోవాలి.
*చట్టపరమైన చర్యలు: ప్రభుత్వ, డిఫెన్స్ స్థలాల ఆక్రమణ రుజువైతే ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.
*నిర్మాణాల నిలిపివేత: చట్టవిరుద్ధంగా చేపడుతున్న పనులను వెంటనే నిలిపివేయాలి.
ప్రభుత్వ, చెరువుల స్థలాలనే కాకుండా రక్షణ శాఖ భూములను కూడా ఆక్రమిస్తున్న ముఠాలపై కఠినంగా వ్యవహరిస్తామని హైడ్రా వర్గాలు తెలిపాయి.



