అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ భారీ నిరసన | నీట్ అవకతవకలపై విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్
బాలాపూర్:
ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును నిరసిస్తూ మహేశ్వరం నియోజకవర్గం, జిల్లెల్ గూడ డివిజన్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ ధర్నాలో చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
*ప్రజాస్వామ్యానికే మచ్చ:
ఈ సందర్భంగా చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి మాట్లాడుతూ… లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న నీట్ పరీక్షా అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు మద్దతుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు కాంగ్రెస్ ఎంపీలను అక్రమంగా అరెస్టు చేసి, నేరస్థుల్లా చూడటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో ప్రతిపక్ష నాయకుడికే నిరసన తెలిపే హక్కు లేకుండా చేయడం అంటే సామాన్య ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని ‘చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి’ నిలదీశారు. కేంద్రం ఎన్ని అణచివేత చర్యలకు పాల్పడినా ప్రజల తరఫున, యువత తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.
*కార్యక్రమంలో భారీగా పాల్గొన్న శ్రేణులు:
ఈ నిరసన కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, డివిజన్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.



