*టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్
*హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా కేబుల్ టీవీ వార్తా ప్రసార మాధ్యమాలలో విధులను నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు వెంటనే అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నాడు ఆయన పలువురు ఫెడరేషన్ నాయకులతో కలిసి సచివాలయంలో రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ ముకుంద రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ, అక్రెడిటేషన్ల ప్రక్రియ ప్రారంభమై దాదాపు నాలుగు నుంచి ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ, ఇప్పటివరకు అర్హులైన జర్నలిస్టులందరికీ కార్డులు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేబుల్ ఛానళ్లలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఒక్క కార్డు కూడా కేటాయించకపోవడం శోచనీయమన్నారు. పలు రకాల నిబంధనల పేరుతో ఈ సమస్యను జాప్యం చేస్తున్నారని, జిల్లాలలో జిల్లా ప్రజా సంబంధాల అధికారులు కేబుల్ ఛానల్ జర్నలిస్టులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు.
అర్హతలన్నీ ఉన్న కేబుల్ ఛానళ్ల జర్నలిస్టులకు తక్షణమే అక్రెడిటేషన్లు మంజూరు చేయాలని, అదేవిధంగా జిల్లా కేంద్రంలోనే స్టూడియో ఉండాలనే కఠిన నిబంధనను సడలిస్తూ ప్రత్యేకంగా సర్క్యులర్ జారీ చేయాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) రిజిస్ట్రేషన్ కలిగి, ఐపీ బాక్స్ (IP Box) ల ద్వారా ప్రసారాలు అందిస్తున్న అన్ని ఛానళ్లకు కూడా అక్రెడిటేషన్ కార్డులు వర్తింపజేయాలని కోరారు.
జర్నలిస్టుల విజ్ఞప్తిపై సమాచార శాఖ ప్రత్యేక కమీషనర్ ముకుంద రెడ్డి సానుకూలంగా స్పందించారు. కేబుల్ ఛానళ్ల అక్రెడిటేషన్ల సమస్యను అతి త్వరలోనే పరిష్కరిస్తామని, అర్హులైన కేబుల్ ఛానల్ జర్నలిస్టులందరికీ పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్ఛారు.
ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు కుంచం శ్రీనివాస్, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి. రవికుమార్, కో-కన్వీనర్ ఆర్. శ్రీనివాస్ గౌడ్, కేబుల్ ఛానళ్ల ప్రతినిధులు మహ్మద్ షఫీవుద్దీన్, జీవన్ కుమార్ గౌడ్, ఫారూఖ్ పటేల్, జూలూరు సత్యం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


