- అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పెన్షన్ల నిలిపివేతపై ఆవేదన
- ఉద్యోగుల తల్లిదండ్రులకు వచ్చే పెన్షన్ పై కూడా కోత
హైదరాబాద్:
కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాలను నెట్టుకొస్తున్న మహిళలకు పెన్షన్ భరోసా ఎంతో అవసరం.అలాంటిది ఇప్పుడు ప్రజా ప్రభుత్వం దుందుడుకు చర్యలతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా జీహెచ్ఎంసీ, సీఎంసీ,ఎంఎంసీ, కార్యాలయాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న కొందరు ఒంటరి మహిళలు,వితంతువులకు, వారి తల్లిదండ్రులకు వచ్చే చేయూత పెన్షన్లను నిలిపివేయడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అరకొర జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న తమకు చేయూత పెన్షన్ ద్వారా వచ్చే ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగపడేదని, ఇప్పుడు ఆ భరోసా కూడా లేకుండా పోయిందని వాపోతున్నారు.ఉద్యోగం చేస్తున్నారనే కారణంతో పెన్షన్ నిలిపివేసినట్లు తెలుస్తోందని బాధిత మహిళలు చెబుతున్నారు. అయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వచ్చే వేతనాలు పరిమితంగానే ఉండటంతో ఇంటి కిరాయి, కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, వైద్యం వంటి అవసరాలకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు అంటున్నారు.
“ఉద్యోగం ఉందని చెప్పి పెన్షన్ నిలిపివేయడం ఎంతవరకు న్యాయం?”
బాధిత మహిళలు ప్రశ్నిస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగం శాశ్వత ఉద్యోగం కాదని, ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో తమకు పెన్షన్ ఒక చిన్నపాటి ఆర్థిక అండగా ఉండేదని చెబుతున్నారు. భర్తను కోల్పోయి కుటుంబ బాధ్యతలను మోస్తున్న వితంతువులు, ఒంటరి మహిళల పరిస్థితిని అధికారులు మానవతా దృక్పథంతో పరిశీలించాలని వారు కోరుతున్నారు. ఉద్యోగం చేస్తున్నారనే ఒక్క కారణంతో కాకుండా.. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి, ఆదాయం, బాధ్యతలను పరిగణనలోకి తీసుకుని చేయూత పెన్షన్ పునరుద్ధరించేందుకు ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.“చేయూత పేరుతో అందుతున్న చిన్న మొత్తమే మా కుటుంబాలకు పెద్ద అండ.. దాన్ని కూడా దూరం చేయొద్దు” అంటూ బాధిత మహిళలు అధికారులను దీనంగా వేడుకుంటున్నారు.


