- తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ జే.ఏ.సీ టెక్నికల్ సెమినార్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీజీఆర్డీసీ ఛైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి
- అసోసియేషన్ ద్వారా సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపు
ఎల్బీనగర్
తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ జేఏసీ ఆధ్వర్యంలో కర్మన్ ఘాట్ లోని శిల్పి గ్రాండ్లో నిర్వహించిన టెక్నికల్ సెమినార్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ మల్రెడ్డి రాంరెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై సభను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా శ్రీ మల్రెడ్డి రాంరెడ్డి గారు మాట్లాడుతూ, విద్యుత్ రంగంలో సేవలందిస్తున్న ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్లు రాష్ట్ర అభివృద్ధిలో కీలక భాగస్వాములని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న నేపథ్యంలో ప్రతి టెక్నీషియన్ ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన విద్యుత్ సేవలు అందించాలంటే నిరంతర శిక్షణ, నైపుణ్యాభివృద్ధి మరియు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన అత్యంత అవసరమని తెలిపారు. ఇలాంటి టెక్నికల్ సెమినార్లు ఆధునిక పరికరాల వినియోగం, విద్యుత్ భద్రత, ప్రమాదాల నివారణ, కొత్త సాంకేతిక విధానాలపై టెక్నీషియన్లకు ఉపయోగకరమైన అవగాహన కల్పిస్తాయని అన్నారు.
ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్లు సంఘటితంగా అసోసియేషన్ రూపంలో ముందుకు రావడం ద్వారా తమ వృత్తికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమర్థవంతంగా పరిష్కరించుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. సమష్టి కృషితో వృత్తికి గౌరవం, గుర్తింపు మరింత పెరుగుతుందని అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు కార్మికుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కార్మికుల భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
వృత్తిపరమైన గుర్తింపు కోసం ప్రతి ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ సంబంధిత అధికారుల ద్వారా వైర్‌మ్యాన్ లైసెన్స్ పొందేందుకు ముందుకు రావాలని సూచించారు. లైసెన్స్ కలిగి ఉండటం ద్వారా అధికారికంగా విద్యుత్ పనులు, కాంట్రాక్టులు నిర్వహించే అవకాశాలు మరింత విస్తరిస్తాయని తెలిపారు.
ఇటీవల విద్యుదాఘాతంతో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని రూ.8 లక్షలకు పెంచడం, కార్మికుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్లకు ప్రభుత్వం తరఫున ఎలాంటి సహకారం అవసరమైనా, వారి సమస్యలను గౌరవ కార్మిక శాఖ మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని మల్రెడ్డి రాంరెడ్డి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నక్క యాదగిరి గారు, తెలంగాణ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జి.సి. రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శులు నేమాల బెనర్జీ గారు, వై. వెంకటేశ్వర్లు గారు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు పొదిలా గోవర్ధన్ గారు, ఏఎంసీ డైరెక్టర్ పన్యాల జైపాల్ రెడ్డి గారు, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు రమాకాంత్ గుప్తా గారు, సునీల్ బాబు గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకట్రామ్ రెడ్డి గారు, మాజీ టెంపుల్ డైరెక్టర్ కిరణ్ గారు, జేఏసీ రాష్ట్ర నాయకులు కొండ బాల్‌రెడ్డి గారు, శ్రావణ్ కుమార్ గారు, అలాగే తెలంగాణలోని వివిధ జిల్లాల ప్రతినిధులు లక్ష్మణ్ గారు, బ్రహ్మచారి గారు, కరుముద్దీన్ గారు, బుచ్చిరెడ్డి గారు, భూపాల్ రెడ్డి గారు, ఎం. కృష్ణ గారు, కె. భీమేష్ గారు తదితరులు పాల్గొన్నారు.


