- అధికారుల పేర్లు చెప్పి ప్రజలను మోసగిస్తున్న దళారులు..
- భూ యజమానులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
- 22-ఏ జాబితాలోని భూముల సమస్యలపై నేరుగా మండల అధికారులను సంప్రదించాలి
ఎల్బీనగర్:
తెలంగాణ భూ భారతి 22-ఏ జాబితాలో ఉన్న భూముల సమస్యలను పరిష్కరిస్తామంటూ కొందరు దళారులు ప్రజలను మోసం చేస్తున్నారని, అలాంటి వ్యక్తులను నమ్మవద్దని, సరూర్ నగర్ మండలం తహసీల్దార్ పి. వేణుగోపాల్ భూ యజమానులకు విజ్ఞప్తి చేశారు. అధికారుల పేర్లు, కార్యాలయాల పేర్లు చెప్పి భూ సమస్యలు పరిష్కరిస్తామని డబ్బులు వసూలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.22-ఏలో తమ భూమి సర్వే నెంబర్ నమోదై ఉండటం, తొలగింపు లేదా ఇతర సమస్యలు ఉన్న భూ యజమానులు ఎలాంటి మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా సంబంధిత మండల రెవెన్యూ అధికారులను సంప్రదించాలని తహసీల్దార్ స్పష్టం చేశారు. భూ సమస్యల పరిష్కారానికి అధికారిక ప్రక్రియ ఉంటుందని, దళారుల మాటలు నమ్మి డబ్బులు చెల్లిస్తే మీరే నష్టపోయే అవకాశం ఉందని తీవ్రంగా హెచ్చరించారు.
అధికారుల పేర్లు చెప్పినా.. నమ్మొద్దు
తమకు ఉన్న అధికార పరిచయాలతో, కర్మాన్ ఘాట్, దాతు నగర్, గణేష్ నగర్ ప్రాంతాలలో కొంతమంది దళారులు 22-ఏ భూ యాజమానుల సమస్యను పరిష్కరిస్తామని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్లు, అధికారుల పేర్లను వాడుతూ, వాట్సాప్ గ్రూపులు సృష్టించి ప్రజలను డబ్బులు డిమాండ్ చేసి వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా భూ యజమానుల ఆందోళనను ఆసరాగా చేసుకుని డబ్బులు డిమాండ్ చేసే వారి వివరాలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
నేరుగా అధికారులను సంప్రదించండి
22-ఏలో భూమి సర్వే నెంబర్ నమోదుకు సంబంధించిన ఏవైనా సందేహాలు, అభ్యంతరాలు లేదా సమస్యలు ఉంటే సంబంధిత మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలని మండల అధికారులు సూచించారు. అధికారిక పత్రాలు, రికార్డుల ఆధారంగా సమస్యను పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కారం చూపుతామని తెలిపారు. ప్రజలు దళారుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, భూ వ్యవహారాల్లో అబద్ధాలు చెప్తూ మోసం చేసే దళారులకు డబ్బులు చెల్లించవద్దని, ఆ తరువాత భాద పడవద్దని తహసీల్దార్ పి. వేణుగోపాల్ మరోసారి మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


