Saturday, October 10, 2026
Google search engine
Homeతెలంగాణపారదర్శక పాలనకు స్వచ్ఛంద సమాచార వెల్లడి కీలకం

పారదర్శక పాలనకు స్వచ్ఛంద సమాచార వెల్లడి కీలకం

  • సమాచార హక్కు ప్రజాస్వామ్యానికి ప్రాణాధారం
  • ప్రతి దరఖాస్తుకు గడువులోగా స్పష్టమైన, సహేతుకమైన సమాధానం ఇవ్వాలి
  • సమాచార హక్కు వారోత్సవాలు–2026లో గవర్నర్‌ శ్రీ శివప్రతాప్‌ శుక్లా

హైదరాబాద్‌

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కేవలం ఒక చట్టం మాత్రమే కాదని, ప్రజాస్వామ్యానికి ప్రాణాధారమని తెలంగాణ గవర్నర్‌ శ్రీ శివప్రతాప్‌ శుక్లా అన్నారు. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజల భాగస్వామ్యానికి ఈ చట్టం పునాది అని పేర్కొన్నారు.

శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ సమాచార కమిషన్‌ నిర్వహించిన సమాచార హక్కు వారోత్సవాలు–2026లో గవర్నర్‌ పాల్గొని ప్రసంగించారు.
ప్రజలు దాఖలు చేసే ఆర్టీఐ దరఖాస్తులను కేవలం కాగితాలుగా చూడకూడదని, వాటి వెనుక ఒక సమస్య, హక్కు లేదా న్యాయం కోసం చేసే విజ్ఞప్తి ఉంటుందని గవర్నర్‌ అన్నారు. దరఖాస్తులు, అప్పీళ్ల పరిష్కార గణాంకాలే చట్టం విజయానికి కొలమానం కాదని, పరిపాలనా విధానాల్లో శాశ్వతమైన పారదర్శక మార్పు రావాలని ఆకాంక్షించారు.
సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 4 ప్రకారం స్వచ్ఛంద సమాచార వెల్లడి (ప్రో యాక్టివ్‌ డిస్‌క్లోజర్‌)కు అత్యంత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, విధానాలు, అర్హతలు, ప్రక్రియలకు సంబంధించిన సమాచారం ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంటే ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు చేయాల్సిన అవసరం తగ్గుతుందని చెప్పారు.
తెలంగాణ వంటి వైవిధ్యభరితమైన రాష్ట్రంలో తెలుగు సహా స్థానిక భాషల్లో సమాచారం అందుబాటులో ఉంచాలని గవర్నర్‌ సూచించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, మహిళలు, దివ్యాంగులు, సమాజంలోని అట్టడుగు వర్గాలకు సమాచార హక్కు సులభంగా చేరేలా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కృత్రిమ మేధ (ఏఐ), డేటా విశ్లేషణ, డిజిటల్‌ రికార్డుల నిర్వహణ వంటి ఆధునిక సాంకేతికతలను సురక్షితంగా, అందరికీ అందుబాటులో ఉండేలా వినియోగించడం ద్వారా సమాచార వ్యవస్థను మరింత పారదర్శకంగా, వేగవంతంగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు.
ప్రతి దరఖాస్తుకు బాధ్యతాయుతంగా స్పందించాలి
ప్రజా సమాచార అధికారులు (పీఐఓలు), ప్రథమ అప్పీలేట్‌ అధికారులు ప్రతి దరఖాస్తును బాధ్యతగా స్వీకరించాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. నిర్ణీత గడువులోగా నిష్పక్షపాతంగా, స్పష్టమైన, సహేతుకమైన సమాధానాలు అందించడాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలన్నారు. అదే సమయంలో పరిపాలనా పారదర్శకతకు, పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కుకు మధ్య సమతుల్యత పాటించాలని సూచించారు.
సెప్టెంబరు 10, 2026న హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌సీఐ)లో జరిగిన జాతీయ సదస్సులో పాల్గొన్న విషయాన్ని గవర్నర్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. వివిధ రాష్ట్రాల ప్రధాన సమాచార కమిషనర్లు, సమాచార కమిషనర్లతో కార్యాచరణలో ఏకరూపతపై జరిగిన చర్చలు సార్థకంగా సాగాయని తెలిపారు. ఇలాంటి అనుభవాల మార్పిడి ద్వారా ఆర్టీఐ చట్టాన్ని మరింత సమర్థంగా, ఏకరీతిలో అమలు చేయవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రజల్లో అవగాహన పెంపొందించడం, సమాచార హక్కుపై సరైన మార్గదర్శకత్వం అందించడం, సుపరిపాలనను బలోపేతం చేయడం కోసం తెలంగాణ సమాచార కమిషన్‌ చేస్తున్న కృషిని గవర్నర్‌ అభినందించారు. ప్రతి పౌరుడు ఆత్మవిశ్వాసంతో తన హక్కులను కోరగలిగేలా, ప్రతి ప్రభుత్వ సంస్థ బాధ్యతతో స్పందించేలా పారదర్శక, సాధికార తెలంగాణ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌ డాక్టర్‌ జి. చంద్రశేఖర్‌రెడ్డి గత 15 నెలల్లో సమాచార కమిషన్‌ సాధించిన ప్రగతిని వివరించారు.

ఉత్తమ ప్రతిభ కనబరిచిన సంస్థలు, అధికారులకు అవార్డులు
సమాచార హక్కు వారోత్సవాల్లో భాగంగా వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సంస్థలు, అధికారులకు గవర్నర్‌ అవార్డులు ప్రదానం చేసి సత్కరించారు.

ఉత్తమ స్వచ్ఛంద సమాచార వెల్లడి – జిల్లా కేటగిరీ: నల్గొండ జిల్లా కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌, మహబూబాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ వినోద్‌ కుమార్‌, టీజీ జెన్‌కో సీఎండీ ఎస్. హరీష్‌ అవార్డులు అందుకున్నారు.

ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాలు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ అంకిత్‌, సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, హన్మకొండ జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పేయి అవార్డులు అందుకున్నారు.

ఉత్తమ పనితీరు కనబరిచిన శాఖ: పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు అవార్డు లభించగా, ఆ శాఖ కమిషనర్‌ దివ్య దేవరాజన్‌ అవార్డును స్వీకరించారు.
ఉత్తమ పనితీరు కనబరిచిన సచివాలయ శాఖ: ఆర్థిక శాఖకు అవార్డు లభించగా, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా అవార్డును స్వీకరించారు.

ఉత్తమ ప్రజా సమాచార అధికారులు (పీఐఓలు): ఖమ్మం కలెక్టరేట్‌ డీఆర్వో రామ్మూర్తి, నిజామాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎం.ఏ. నజీర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి, తెలంగాణ సమాచార కమిషన్‌ పీఐఓ జె. రాము అవార్డులు అందుకున్నారు.

ప్రత్యేక కేటగిరీ: ఉత్తమ పనితీరు కనబరిచిన సంస్థగా టీజీఆర్టీసీకి సంబంధించి వై. నాగిరెడ్డి, రామగుండం తహసీల్దార్‌ రవీందర్‌రావు అవార్డులు అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌. సుభాష్‌రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బెన్‌హర్‌ మహేశ్‌ దత్త ఏక్కా, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి వినయ్‌కుమార్‌, రాష్ట్ర సమాచార కమిషనర్లు పి.వి. శ్రీనివాసరావు, మొహ్సినా పర్వీన్‌, దేశాల భూపాల్‌, వైష్ణవి మెర్ల, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజా సమాచార అధికారులు, ప్రథమ అప్పీలేట్‌ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments