- స్టేషన్ పరిధిలో 2 లక్షల మంది జనాభా..
- ప్రతిరోజూ వందలాది మంది బాధితుల రాక..
- ముగ్గురు ఎస్ఐలు.. ముగ్గురు ఏఎస్ఐలతో
- విధుల నిర్వహణలో పోలీసులకు సవాళ్లు
- ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని ప్రజానీకం వినతి
ఎల్బీనగర్
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతిరోజూ వందలాది మంది బాధితులు ఆశ్రయించే ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరత తీవ్ర ఇబ్బందులకు దారితీస్తోంది. హైవేపై ఉండడం, చుట్టుపక్కల కన్నా ఎక్కువగా కేసులు నమోదు కావడం జరుగుతుంది. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో 82 కాలనీలలో సుమారుగా 2 లక్షల మంది నివాసితులు ఉంటారు. వివిధ సమస్యలపై ఫిర్యాదులు చేసేందుకు వచ్చే ప్రజలకు సకాలంలో సేవలు అందించడంలో స్టేషన్ అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ పరిధిలో నిత్యం అనేక ఫిర్యాదులు, వివాదాలు, ఇతర సమస్యలు వస్తుండగా, వాటిని పరిష్కరించేందుకు సరిపడా సిబ్బంది లేకపోవడంతో, ముగ్గురు ఎస్ఐలు, ముగ్గురు ఏఎస్ఐలతో నెట్టుకొస్తుండగా, ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. దీంతో ప్రజలకు పోలీస్ సేవలు అందించడంలో జాప్యం జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ ఉన్నతాధికారులు ఇప్పటికైనా తమ దృష్టి సారించాలని సిబ్బందిని పెంచి ప్రజలకు సత్వర న్యాయ సహాయం అందించాలని స్థానిక ప్రజలు వినతి వ్యక్తం చేస్తున్నారు.


